Saturday, November 23, 2024
HomeTrending Newsవారాల ఆనంద్ కి కేటీఆర్ అభినందనలు

వారాల ఆనంద్ కి కేటీఆర్ అభినందనలు

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొందిన తెలంగాణ బిడ్డ వారాల ఆనంద్ కి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే తారకరామారావు అభినందనలు తెలిపారు. ప్రముఖ భావకవి గుల్జార్ గారి 58 కవితలను ‘ఆకుపచ్చ కవితలు’ పేరిట తెలుగులో అనువదించిన వారాల ఆనంద్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం దక్కడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గుల్జార్ లాంటి గొప్ప కవి సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు వారాల ఆనంద్ తన అనువాదం ద్వారా అందించడం గొప్ప విషయమని కేటీఆర్ అన్నారు. ఆనంద్ తెలంగాణకు ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం, స్థానిక ప్రజాప్రతినిదిగా తనకు మరింత సంతోషాన్ని ఇస్తుందని కేటీఆర్ తెలిపారు.

కరీంనగర్ కు చెం దిన ప్రముఖ కవి, రచయిత వారాల ఆనంద్ కు  అనువాద రచనల విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ప్రముఖ ఉర్దూ, పంజాబీ కవి గుల్జార్ రాసిన ‘గ్రీన్ పోయెమ్స్’ ను…  పవన్‌ కే వర్మ ఆంగ్లానువాదం చేయగా ఆనంద్ ‘ఆకుపచ్చ కవితలు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ–2022 అవార్డులకు సంబంధించి  కవితలు, అనువాద విభాగాల్లో పురస్కారాలను గురువారం కేంద్రం ప్రకటించింది. ట్రాన్స్ లేషన్ విభాగంలో వారాల ఆనంద్ రాసిన ఆకుపచ్చ కవితలు పుస్తకానికి అవార్డు దక్కింది. గుల్జార్.. హిందీలో రాసిన గ్రీన్ పోయెమ్స్​లో 58 కవితలు ప్రకృతికి సంబంధించినవే ఉన్నాయి. మనిషి, ప్రకృతి మధ్య అనుబంధాన్ని ఈ కవితల ద్వారా ఎంతో సూటిగా చెప్పారు. వేములవాడలో పుట్టిన ఆనంద్, కరీంనగర్ లో స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కవితలు, కథలు రాయడం ఆనంద్​కు అలవాటు. మొత్తం 17 భాషల్లో ట్రాన్స్​లేషన్​లకు సంబంధించి అవార్డులను ప్రకటించింది. విజేతలకు రూ.50 వేల నగదు, తామ్ర పత్రం అందించనున్నారు.

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో సినారె సహా ఇప్పటి వరకు ఐదుగురికి కేంద్ర సాహిత్య అవార్డులు రాగా, ఈ ఏడాదే రెండు కేటగిరీల్లో ఈ గౌరవాన్ని జిల్లా కవులు దక్కించుకున్నారు. సిరిసిల్లకు చెందిన పత్తిపాక మోహన్ బాలసాహిత్యంలో అవార్డు దక్కించుకోగా, అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్ ఎంపికయ్యారు. ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్లు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతినిధుల నుంచి సమాచారం అందగానే ఆనంద్​ అభిమానులు, సాహితీ వేత్తలు ఆయనకు పోటాపోటీగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్