వెండితెరపైకి వినోదాత్మక చిత్రాలు ఎక్కువగా వస్తుంటాయి. ప్రయోగాత్మక చిత్రాలు మాత్రం అడపా దడపా మాత్రమే పలకరిస్తుంటాయి. వినోదాత్మక చిత్రాలను ప్రేక్షకులు చాలా వరకూ ఆదరిస్తారు. ప్రయోగాత్మక చిత్రాలు ఎంతవరకూ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయనేది చెప్పలేం. అందువలన ఇలాంటి కథలను సినిమాగా చేయడానికి ధైర్యం కావలసింది నిర్మాతలకే. ఎందుకంటే ప్రయోగాల ప్రభావం తీవ్రత వాళ్లపైనే ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలా వచ్చిన సినిమానే ‘105’ మినిట్స్’.
హన్సిక ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, రాజు దుస్సా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హన్సిక .. ‘జాను’ అనే పాత్రను పోషించింది. జాను ఒక రోజు రాత్రి వేళ తన ఇంటికి చేరుకుంటుంది. ఆ ఇంట్లో చిత్రమైన సంఘటనలు జరుగుతూ ఆమెను భయపెడుతూ ఉంటాయి. దాంతో తనకి తెలియని దుష్టశక్తి ఏదో ఆ ఇంట్లో ఉందని ఆమె భావిస్తుంది. తన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆ ఇంట్లో నుంచి బయటపడాలని భావిస్తుంది. అందుకోసం ఆమె చేసిన ప్రయత్నం ఫలిస్తుందా? .. లేదా? అనేది సస్పెన్స్.
ఇది ఒక ప్రయోగంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా మొత్తం మీద హన్సిక మాత్రమే కనిపిస్తుంది. ఒక పాత్రతో మాత్రమే నడిచే సినిమా అంటూ ముందుగానే పబ్లిసిటీ చేశారు. రెండో పాత్ర అనేది లేదని తెలిసిన ప్రేక్షకుడు, ఇక తెరపై జరుగుతున్న సంఘటనలకి పెద్దగా స్పందించడు. అదంతా ఆమె భ్రమనే అనుకుంటాడు. అది భ్రమకాదు .. ఆమె భయపడానికి ఒక కారణం ఉందంటూ దర్శకుడు దాని గురించి చెప్పే ప్రయత్నం చేయలేదు. కథాకథనాల్లో బలం లేకపోవడంతో, హన్సిక చేసినదంతా ఏకపాత్రాభినయం మాదిరిగానే కనిపిస్తుంది .. అనిపిస్తుంది.