చంద్రబాబు జనాన్ని విడిచి సాము చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ ర్యాలీ జరిగింది. భూమన ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. భూమన మాట్లాడుతూ రాయలసీమ గుండెచప్పుడు ఏమిటో ఈ ర్యాలీతో తిరుపతి వాసులు చాటి చెప్పారని సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలోనే సీమ అభివృద్ధి జరిగిందని, పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని వైఎస్ పెంచితే టిడిపి నాడు ప్రకాశం బ్యారేజ్ వద్ద ధర్నా చేయించిందని భూమన గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులను ప్రజలు స్వాగతిస్తున్నారని, వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. సీమ ప్రజల ఆవేదన ఏ స్థాయిలో ఉందో ఈ ర్యాలీ ద్వారా తెలిసిందన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే సత్తా జగన్ కే ఉందన్నారు. కర్నూలుకు న్యాయ రాజధానివస్తే అభివృద్ధి జరుగుతుందా అని కొందరు అడుగుతున్నారని, ఈ ప్రాంతానికి న్యాయ రాజధాని వస్తే ఎనిమిది జిల్లాల ప్రజల ఆత్మగౌరవం నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఎంతో వెనకబడి ఉన్నాయని, ఈ ప్రాంతానికి చంద్రబాబు ద్రోహం చేశారని… ఇప్పుడు కూడా ఈ రాయలసీమ నాశనం కావాలని పాదయాత్ర చేయిస్తున్నారని కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
ఇది కేవలం ఒక్క తిరుపతి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమమన్నారు. ఇక్కడ 50ఏళ్ళుగా ఎన్నో సభలను తాను నిర్వహించానని, కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంతమంది నేడు హాజరయ్యారని భూమున అన్నారు. తాను జాతీయ నాయకుడిని కాదని, మంత్రిని కూడా కాదని, సాధారణ శాసన సభ్యుడిని మాత్రమేనని, అలాంటి సాధారణ వ్యక్తిని ఒక్క పిలుపు ఇస్తే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని దీని జయప్రదం చేశారని….అందరికీ పాదాభివందనం అంటూ భావోద్వేగం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో తిరుపతి ఎంపీ డా. గురుమూర్తి, మేయర్ డా. శిరీష, రాయలసీమ హక్కుల వేదిక నేత పురుషోత్తమ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.
Also Read : విశాఖగర్జనకు పోటెత్తిన జనం