కొరటాల శివకి దర్శకుడిగా మంచి ఇమేజ్ ఉంది. రచయితగానూ అంతకంటే ముందు నుంచే ఆయనకి మంచి పేరు ఉంది. కొరటాల మాట తీరు మాదిరిగానే ఆయన కథలు .. పాత్రలు పద్ధతిగా ఉంటాయి. సినిమాటిక్ డ్రామా కంటే, సహజత్వానికి దగ్గరగా తన కథలను తీసుకుని వెళ్లడం ఆయన ప్రత్యేకతగా కనిపిస్తూ ఉంటుంది. తక్కువ డైలాగ్స్ .. తేలికైన పదాలతో ఆడియన్స్ కి కంటెంట్ ను కనెక్ట్ చేయడం ఆయనకి బాగా తెలుసు.
‘ఆచార్య’ సినిమాకి ముందు వరకూ కొరటాలకి ఫ్లాప్ అనేది తెలియదు. ‘ఆచార్య’ కంటెంట్ ను కూడా మరీ అంత తేలికగా పక్కన పెట్టలేం. కానీ చిరంజీవి – చరణ్ కాంబినేషన్ పరంగా ఉన్న భారీ అంచనాలను అందుకోలేకపోయింది. కారణం ఏదైనా కొరటాల ఈ సినిమా కాస్త గట్టిగానే ఇబ్బంది పెట్టింది. ఈ దెబ్బ నుంచి కొరటాల కోలుకోవడానికి చాలా సమయం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే కొరటాల చాలా వేగంగానే తేరుకున్నాడు. ఎన్టీఆర్ హీరోగా ఆయన ‘దేవర‘ కథను రెడీ చేసుకుని రంగంలోకి దిగాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత ఎన్టీఆర్ ఈ సినిమా ఒప్పుకున్నాడంటే, కంటెంట్ విషయంలో ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడనేది అర్థం చేసుకోవచ్చు. ఈ కథ నేపథ్యం .. ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ .. జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇక్కడ పరిచయం కానుండటం .. ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ అనే అంశాలు ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి. ‘ఆచార్య’ పరాజయాన్ని మరిపించడానికి కొరటాల చేస్తున్న యజ్ఞంగానే ఈ సినిమాను భావించాలి. ‘దేవర’తో పాన్ ఇండియా హిట్ కొడతాడేమో చూడాలి మరి.