ఈ మధ్య కాలంలో ఇటు ఓటీటీలోను .. అటు వెండితెరపై కూడా మలయాళ కథల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. మలయాళ నుంచి వచ్చిన సినిమాల తెలుగు అనువాదాలకు ఓటీటీలో ఒక రేంజ్ లో రెస్పాన్స్ కనిపిస్తోంది. అలా మలయాళ కథలను తెలుగులో స్టార్ హీరోలు రీమేక్ చేయడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన సినిమాలను కూడా ఇక్కడ రీమేక్ చేస్తున్నారు.
అలాంటి సినిమాలలో ఒకటిగా ‘నాయట్టు’ కనిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమానే తెలుగులో ‘కోటబొమ్మాళి పీఎస్’ గా రీమేక్ చేశారు. గీతా ఆర్ట్స్ 2 వారు ఈ సినిమాను నిర్మించారు. శ్రీకాంత్ .. వరలక్ష్మి శరత్ కుమార్ .. రాహుల్ విజయ్ .. శివాని రాజశేఖర్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 24వ తేదీన విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.
మలయాళంలో ‘నాయట్టు’ విషయానికి వస్తే, స్థానికంగా ఉండే ఒక ముగ్గురు పోలీస్ లకు … కొంతమంది రౌడీలకు గొడవ జరుగుతుంది. ఆ తరువాత జరిగిన ప్రమాదంలో ఆ రౌడీ మూకకి చెందిన వ్యక్తి చనిపోతాడు. పోలీసులే కావాలని చెప్పి ఆ వ్యక్తిని చంపారనే ఆవేశంతో రౌడీ ముఠా రంగంలోకి దిగుతుంది. ఇక పోలీస్ డిపార్టుమెంటు కూడా పోలీసులనే అనుమానించి వాళ్లను వెదకడం మొదలు పెడుతుంది. ఫలితంగా చోటుచేసుకునే మలుపులతో ఈ కథ ఆసక్తిని రేకెత్తిస్తుంది. తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలో మార్పులు చేశారని తెలుస్తోంది. మరి ఇక్కడ ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.