Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసమాధి కావాల్సింది సమస్యలు…మనుషులు కాదు!

సమాధి కావాల్సింది సమస్యలు…మనుషులు కాదు!

బతుకంటే పోరాటం కాదా? కష్టం వస్తే ఎదురొడ్డి నిలబడటం మనిషి నైజం కాదా?

హైదరాబాద్ చర్లపల్లి రైల్వే ట్రాక్.. చీకటి రాత్రి.
సమయం 11:30.
ఆమె విజయారెడ్డి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. టీమ్ లీడర్.
పక్కన ఇద్దరు పిల్లలు.. చేతన రెడ్డి, విశాల్ రెడ్డి.
చదువుకుంటున్నారు. రేపటి కలలు కంటున్నారు.
కానీ, ఆ తల్లి మనసులో మాత్రం మరో ఆలోచన సుడులు తిరుగుతోంది.

ఎందుకు?

ఈ ప్రశ్నకు జవాబు ఆ పట్టాల కిందే నలిగిపోయింది.
భర్త సౌదీలో ఉన్నాడు. నాలుగు నెలల క్రితమే వచ్చి వెళ్ళాడు.
సొంత ఇల్లు ఉంది, మంచి హోదా ఉంది.
అమ్మ పుష్పలత కళ్ల ముందే ఉంటుంది.
మరి లోటు ఎక్కడ? ఆ దుర్భరమైన నిర్ణయానికి ప్రేరేపించిన శక్తి ఏది?

చావుకు ఒప్పించిన తల్లి.. ఒప్పుకున్న పిల్లలు

అమ్మాయి, అబ్బాయి ఇంటర్ చదువుతున్నారు.
శారీరకంగా అమ్మ కంటే వాళ్లే బలవంతులు.
కానీ, చర్లపల్లి నుంచి ఘట్‌కేసర్ వరకు ఆ గంటన్నర నడకలో..
ఆ తల్లి వాళ్ళకు ఏ ‘మాటల మంత్రం’ వేసింది?
పిల్లలు కూడా అమ్మ మాట కాదనలేకపోయారు.
ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును చూస్తూ కూడా వాళ్లు వెనక్కి తగ్గలేదంటే.. ఆ తల్లి మమకారం అక్కడ మృత్యుపాశమై బిగుసుకుంది.

సూసైడ్ నోట్ చెప్పని రహస్యం

“బతకలేకపోతున్నా.. నన్ను క్షమించండి.”
అమ్మకు రాసిన ఈ చిన్న మాటలో ఎన్ని వేల అర్థాలున్నాయో?
భర్త మీద ఫిర్యాదు లేదు. ఇంట్లో గొడవలు లేవు.
మరి ‘బతకలేకపోతున్నా’ అని ఎందుకు అనిపించింది?
ఆమె ఫోన్‌కు వచ్చిన ఆ ఒక్క మెసేజ్ – “సారీ మేడం, ఇంకోసారి తప్పు చేయను” – దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి?
ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, టీమ్ లీడర్ హోదాలో ఉండి.. ఎవరో చేసిన తప్పుకు తాను శిక్ష వేసుకోవాలా?
అది కూడా తన కన్నబిడ్డల ప్రాణాలను బలితీసుకుంటూ?

సమాజమా.. ఎటు మన పయనం?

విడాకులు తీసుకుని …ఆ సొంత విడాకులమీద కథలు కథలుగా పుస్తకాలు రాసి బజారున పడేసే నాగరిక సమాజం ఒకవైపు..
మనసులో బాధను చెప్పుకోలేక, పరువు పోతుందనే భయంతో పిల్లలతో సహా బలి అయిపోయే సున్నిత మనస్కులు మరోవైపు.
మనం ఎటు వెళ్తున్నాం?

సమాధి కావాల్సింది సమస్యలు…మనుషులు కాదు!

విజయారెడ్డి ఉదంతం మనకు మిగిల్చిన చేదు నిజం ఒక్కటే.. మనం ఆర్థికంగా ఎదుగుతున్నాం కానీ, మానసికంగా కుంచించుకుపోతున్నాం. ఆ గంటన్నర ప్రయాణంలో ఆ తల్లి ఆ ఇద్దరు బిడ్డలకు ‘మృత్యువు’ పాఠం నేర్పగలిగింది కానీ, ‘మనుగడ’ సారాన్ని చెప్పలేకపోయింది. ఇది కేవలం ఒక తల్లి వైఫల్యం కాదు, ఒక కుటుంబ వ్యవస్థ వైఫల్యం.. ఒక సమాజపు అసమర్థత.

చావు సమస్యలకు పరిష్కారం కాదు

అది పిరికితనం నుంచి పుట్టిన ఒక భ్రమ మాత్రమే. సమస్య వచ్చినప్పుడు ప్రాణం తీసుకోవడం అంటే యుద్ధం మొదలవ్వకముందే ఆయుధం పడేయడం. ఒక టీమ్ లీడర్‌గా వందల మంది కెరీర్‌ను గైడ్ చేసిన విజయారెడ్డి, తన సొంత జీవితం దగ్గరకు వచ్చేసరికి ఒక చిన్న సమస్యకు ఓడిపోవడం దేనికి సంకేతం? మన చదువులు కేవలం ఉద్యోగాలకే తప్ప, ఊపిరిని నిలబెట్టుకోవడానికి పనికిరావా?

మనం పిల్లలకు ర్యాంకులు నేర్పిస్తున్నాం, డబ్బుల వేట నేర్పిస్తున్నాం. కానీ, బతకడమే అసలైన పోరాటం అని నేర్పలేకపోతున్నాం. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా, అవమానం ఎదురైనప్పుడు ఆత్మహత్య వైపు చూడకుండా.. ఎదురొడ్డి నిలబడే ‘నైతిక బలాన్ని’ వారికి వారసత్వంగా ఇవ్వలేకపోతున్నాం. అందుకే, ఆ తల్లి మాటే వారికి వేదమైంది.. ఆ మృత్యుబాటే వారికి మార్గమైంది. ప్రతి మనిషికి ఒక తోడు కావాలి. అది డబ్బు రూపంలో వచ్చే ఆర్థిక భద్రత కాదు.. “నేనున్నాను, నీకేం కాదు” అని భుజం తట్టే ఒక ఓదార్పు మాట కావాలి. చర్లపల్లి రైల్వే పట్టాల మీద చిందినది ఆ ముగ్గురి రక్తం మాత్రమే కాదు, మన కుటుంబ వ్యవస్థల నుంచి జారిపోతున్న నమ్మకం.

బతుకంటే నిత్య పోరాటమే కదా?

అవును, పోరాటమే! కానీ ఆ పోరాటంలో ఓడిపోతామని భయపడి, కన్నబిడ్డలను మృత్యువుకు బలివ్వడం ఏ రకమైన సంస్కారం? ఈ ఘటన సమాజానికి ఒక హెచ్చరిక. మనం పిల్లలకు ఐఐటీ సీట్లు, అమెరికా వీసాలు, ఆ కలలు ఇస్తున్నాం కానీ.. సమస్యల సుడిగుండంలో నిలబడే ‘నైతిక బలాన్ని’ ఇవ్వలేకపోతున్నాం.

గుర్తుంచుకోండి.. మనకు కావాల్సింది డబ్బు రూపంలో వచ్చే ఆర్థిక భద్రత కాదు, “నేనున్నాను” అని భుజం తట్టే ఒక ఓదార్పు మాట. ఆ ఒక్క మాట ఆ రాత్రి విజయారెడ్డికి దొరికి ఉంటే, ఈ రోజు ఆ ముగ్గురి ప్రాణాలు మన మధ్యే ఉండేవి. ఇప్పటికైనా మేల్కొందాం.. బంధాలను వెతుక్కుందాం.. మనసులను పలకరిద్దాం. బతకడానికి ఒక్క కారణం వెతుక్కుందాం.. అదే మనిషిగా మన అసలైన విజయం!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular