Saturday, January 18, 2025
Homeఫీచర్స్లిప్ స్టిక్ వయసెంత? అయిదువేల ఏళ్లా?

లిప్ స్టిక్ వయసెంత? అయిదువేల ఏళ్లా?

నా స్నేహితురాలు ఒకమ్మాయి పెదాలపై రంగు పడకుండా బయటకు రాదు. రకరకాల రంగురంగుల లిప్స్టిక్స్ కొంటూ ఉంటుంది. అదేదో పాత సినిమాలో ఒకమ్మాయి ‘లిపిస్టికు’ వేసుకున్నా. బాందా? అని అడుగుతూ ఉంటుంది. అలా ఈ రోజుల్లో ఇతరత్రా మేకప్పులు వేసుకోకపోయినా లిప్స్టిక్ తో లాగించేవారు చాలా మంది ఉన్నారు. దొండపండు వంటి పెదాలు అంటే ఎరుపే కదా! ఆ ఎర్రటి రంగుకోసం పడి చచ్చే వారు చాలామందే ఉన్నారు. అయితే ఇప్పుడు ఎర్రటి రంగే కాదు, ఏ రంగైనా పెదాలపై పండుతోంది. ఇంద్రధనుస్సు పెదాలపై విరుస్తోందంటే అతిశయోక్తి కాదేమో.

అసలు మన దేవతలనే తీసుకుంటే ట్రిమ్ముగా చెదరని మేకప్ తో ఎంత బాగుంటారు? ముఖ్యంగా ఎర్రటిపెదవులు. మన పురాణాలు, శ్లోకాల లోనే దేవీ దేవతల పెదవుల వర్ణన చాలా చోట్ల ఉంటుంది. ఇలా రంగువేసుకోవడం మన సంప్రదాయం కాదు, అంతా విదేశీ సంస్కృతి అంటారు గానీ మన దేశంలోనే పుట్టిందనిపిస్తుంది. పోనీ ఒక్క విదేశీదేవతని లిప్ స్టిక్ తో చూపించండి చూద్దాం. సో, లిప్ స్టిక్ మన సంప్రదాయమే. ఒకప్పుడు తాంబూలంతో ఎర్రబడేవి. తర్వాత రంగుల లిప్స్టిక్ తో అలంకరించుకుంటున్నారు. రకరకాల కారణాల వల్ల కొందరికి పెదాలకు రంగు అవసరం గానూ మరి కొందరికి అనవసరంగా మారింది.

‘సిగ్గు లేకుండా లిప్ స్టిక్ వేసుకుంది చూడు’ అనే వాళ్ళూ ఉన్నారు. నిజానికి ఇది వ్యక్తిగతం. కానీ ఛాందసులు ఇది మన సంప్రదాయం కాదని వాదిస్తూ ఉంటారు. ఏదేమైనా లిప్స్టిక్ అనేది బహు పురాతన సౌందర్యసాధనం అనేందుకు ఇరాన్ లో దొరికిన పాత లిప్స్టిక్ నిదర్శనం. దక్షిణ ఇరాన్లో 2001 వరదల్లోనే రాతి సీసాలో దొరికిన ఈ లిప్ స్టిక్ వివరాలు ఇప్పుడు పరిశోధన కారణంగా బయటకు వచ్చాయి.

సుమారు 5000 సంవత్సరాల క్రితం వాడిన రంగు ఇది. ముదురు ఎరుపు రంగులో ఉంది. అప్పటి ఉన్నత వర్గాల మహిళలు తమ స్థాయి ప్రదర్శించుకోడానికి వాడేవారని తెలుస్తోంది. అనంతర కాలంలో అదే ఇరాన్లో మహిళలు పెదాలకు రంగు వేసుకోకూడదని ఆంక్షలు విధించడం శోచనీయం . హెమటైట్ అనే ధాతువు సమ్మేళనంగా ఈ రంగు తయారైంది. ప్రస్తుతానికి ఇదే పురాతనమైనా మున్ముందు ఇంకా పాతవి దొరికే అవకాశం లేకపోలేదని పురావస్తు శాస్త్రజ్ఞుల అంచనా. లిప్ స్టిక్ ఇప్పటి అతిపోకడకు నిదర్శనమంటూ ధరించే అతివల గురించి అవాకులు చవాకులు మాట్లాడేవారు ఈ విషయం తెలుసుకుంటే మంచిదేమో!

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్