Friday, July 5, 2024
HomeTrending Newsలోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ - బిజెపిల మధ్యనే పోరు

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ – బిజెపిల మధ్యనే పోరు

లోక్ సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు సంసిద్ధం అవుతున్నాయి. జాతీయ సమీకరణాల దృష్ట్యా…అత్యధిక ఎంపి స్థానాలు కైవసం చేసుకునేందుకు బిజెపి – కాంగ్రెస్ పార్టీలు అస్త్ర శస్త్రాలు సిద్దం చేస్తున్నాయి. 2024 ఎన్నికల సరళి చూడబోతే కాంగ్రెస్, బిజెపి మధ్యనే పోటీ కేంద్రీకృతం అయ్యేట్టుగా కనిపిస్తోంది.

ప్రజల ఆలోచన సరళి విశ్లేషిస్తే బిజెపి, కాంగ్రెస్ పార్టీల్లో ఎదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ సొంత పార్టీ అని, కెసిఆర్ తమ ప్రతినిధని భావించిన ప్రజలు కారు విజయం సాధించాలని కోరుకున్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు, ఓటర్ల మనోగతం తెలుసుకుంటే విభిన్నంగా ఉంది. కెసిఆర్ పాలనలో సామాన్య ప్రజలకు మేలు జరగలేదని, వారి కుటుంబ సభ్యులకే పదవులు లభించాయని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

శాసనసభ ఎన్నికల ఫలితాలే లోక్ సభ ఎన్నికల్లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కు మెదక్ స్థానం మినహా ఎంపి స్థానాలు గెలిచే అవకాశాలు స్వల్పంగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకుల అంచనాగా ఉంది. ఎంపి సీట్లు కాంగ్రెస్ కు కొన్ని వచ్చినా బిజెపి నుంచి తీవ్రమైన పోటీ ఉండనుంది. వరంగల్, జహీరాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ స్థానాల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది. మల్కజగిరి, సికింద్రాబాద్ లు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.

కాంగ్రెస్ నుంచి సిఎం రేవంత్ రెడ్డి తన వాగ్దాటితో ప్రచారంలో అగ్రభాగాన ఉండనున్నారు. రాహుల్ గాంధి, ప్రియాంకా గాంధిలు తోడైతే రేవంత్ రెడ్డి శాసనసభ ఎన్నికల మాదిరిగా ప్రచారం నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండటం హస్తం శ్రేణులకు ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. ఈ విషయంలో బిజెపికి కొంత లోటు ఉంది. కమలం రాష్ట్ర సారథి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నందున ఆయన సికింద్రాబాద్ కే పరిమితం అవుతారు. బండి సంజయ్ పరిస్థితి అంతే. వీరిద్దరూ తమ నియోజకవర్గాలకే పరిమితం అవుతే రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేసే నేతలు లేరు.

జాతీయ స్థాయి నేతలు ప్రచారం నిర్వహించి ఎంత సమయం కేటాయిస్తారో చూడాలి. మోడీ, అమిత్ షా ప్రచారం నిర్వహించినా దాని కొనసాగింపుగా రాష్ట్ర స్థాయిలో ప్రచారం నిర్వహించే నేత లేకపోవటం బిజెపికి ఇబ్బందికరంగా ఉండనుంది. రాష్ట్రంలో అగ్రనేతలుగా పేరున్న నేతల కన్నంతా ఎంపిగా పోటీ చేయటం పైనే ఉంది. మోడీ హవాలో గెలుస్తాం…కాలం కలిసి వస్తే కేంద్ర మంత్రి పదవి వరిస్తుందని ఉహల పల్లకిలో ఊరేగుతున్నారు.

రాష్ట్రంలో యువత మెజారిటీగా బిజెపి వైపు ఉన్నారని సమాచారం. సిఎం రేవంత్ రెడ్డి వాక్ చాతుర్యంతో కొంత మార్పు వచ్చినా యువత ఓటు కమలం వైపే అని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ – బిజెపిల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ బలంగా ఉన్న చోట రెండు జాతీయ పార్టీల్లో ఎవరికీ గండిపడుతుందో చూడాలి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్