వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీ నేతలంతా జైలుకెళ్ళక తప్పదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. అందుకే జగన్ ప్రభుత్వం జైళ్ళలో కూడా నాడు-నేడు కార్యక్రమం పెట్టాలని ఆలోచిస్తోందని, అక్కడ వారు పేకాట ఆడుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే బిసీల రక్షణ కోసం ఓ ప్రత్యేక చట్టం తీసుకువస్తామని, ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కు ధీటుగా ఉంటుందని, బిసిలపై ఎవరైనా దాడులు చేసినా, దూషించినా ఈ చట్టం కింద కేసులు పెడతామని, బాధితుల న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ, మంత్రులు కూర్చుని ఈ కేసులపై సమీక్ష చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత బిసిలపై కేసులు ఇష్టానుసారం పెడుతున్నాని, ఇప్పటివరకూ 26 వేల మంది బిసిలపై కేసులు పెట్టారని, తమ పార్టీకి చెందిన యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి సీనియర్ నేతలపై కూడా అక్రమంగా కేసులు పెట్టారని లోకేష్ ఆరోపించారు. యువ గళం పాదయాత్రలో భాగంలో ఉరవకొండ నియోజకవర్గంలోని లో బిసిలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ బిసి ఉపకులాలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి వారిని ఆర్ధికంగా బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. బాబు అంటే బ్రాండ్ అని అయన హయంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని, కానీ ఈ ప్రభుత్వ వేధింపులతో ఎన్నో పరిశ్రమలు తరలి వెళ్లాయని విమర్శించారు. బిసి విద్యార్ధులకు తొలుత నియోజకవర్గ స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు చేస్తామని, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళు, ఫీజు రీఇంబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి పతకాలను పక్కాగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.
తమ ప్రభుత్వ బిసిలకు తాము ఏం చేశామో, ఈ నాలుగేళ్ళలో జగన్ ప్రభుత్వం ఏమి చేసిందో చర్చించేందుకు బహిరంగ చర్చకు రావాలని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రిని సవాల్ చేస్తే ఇంతవరకూ స్పందించలేదని లోకేష్ వెల్లడించారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read : Nara Lokesh: వంద పథకాలు ఆపేశారు: లోకేష్