చంద్రబాబు విజినరీ లీడర్ కాదని, పొలిటికల్ స్కామ్‌స్టార్ అని, 14 ఏళ్ళపాటు సిఎంగా పని చేసిన ఆయనకు అవినీతి నేర చరిత్ర ఈరోజు కొత్తేమీ కాదని వైఎస్సార్సీపీ నేత, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. అనేక కుంభకోణాల్లో ఆయన పాత్ర ఉందనేది వాస్తవమన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భరత్ మీడియాతో మాట్లాడారు. రాజధాని పేరిట అమరావతిని అవినీతి కామధేనువుగా చేసుకున్నారని, పోలవరం ప్రాజెక్టును ఏకంగా ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు.
“రాజకీయాల్లో తనంత సచ్ఛీలుడు లేడని తనకు తానే సత్యహరిశ్చంద్రుడిగా కలరింగ్ ఇచ్చుకునే చంద్రబాబు కుంభకోణాల చంద్రుడని తేలింది. ఎట్టకేలకు పాపం పండింది కనుకే.. ఈరోజు జాతీయ మీడియా ఆయన అవినీతిపై కోడై కూస్తోంది. ఇదే కాకుండా.. టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రజల దగ్గర వసూలు చేసిన సొమ్ముతో జల్సాలు చేసుకున్న నీచుడు చంద్రబాబు. అమరావతిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణానికి చదరపు అడుగుకు దాదాపు రూ.12 వేలు ఖర్చు చేశారు. అక్కడ ఒక్కో చదరపు అడుగుకు కేవలం రూ. 3 వేలు ఖర్చు పెట్టి, మిగతా మొత్తం హైదరాబాద్‌లోని ఇంటికి పంపుకున్నాడు.” అంటూ భరత్ విమర్శించారు.
లోకేశ్ మిడ్‌నైట్ యాత్ర చేస్తున్నాడని, ఎవరికీ ఉపయోగపడని, ప్రజలకు ఏ మాత్రం పనికిరాని ఒక పనికిమాలిన యాత్రను ఎల్లో మీడియా బాగా ఊదరగొడుతుందని భరత్ పేర్కొన్నారు. ఆయన యాత్రలో ఎవరూ పెద్దగా సమస్యలు చెప్పకపోయినా.. లోకేశ్ మాత్రం పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని మరీ.. పొంతన లేని ప్రశ్నలేయించుకుంటూ తిక్కతిక్క సమాధానాలు చెబుతున్నాడన్నారు. రాబోయే కాలంలో ప్రజల్ని ఏదో ఉద్దరిస్తానంటూ.. కొవ్వు తగ్గించుకునే యాత్ర చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
పోలవరంపై మార్గాని మాట్లాడుతూ… “ప్రాజెక్టు పనులపై మరోసారి ఈనాడు పత్రిక తప్పుడు కథనం రాసింది. రామోజీరావు కొడుకు వియ్యంకుడి కంపెనీ నవయుగకు ఓపెన్ టెండర్ కాకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టును చంద్రబాబు దొడ్డిదారిన అప్పగించారు. ఆయన ప్రాజెక్టు పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యం, అవగాహన లేమి వలన డ్యామ్ పనులు చాలా వరకు వరదకు కొట్టుకుపోయాయి. దీనిపైనే నేను జలశక్తి మంత్రిత్వ శాఖను లేఖ రూపంలో ప్రశ్నించగా.. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌షెకావత్ స్పందిస్తూ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన పెండింగ్ నిధులను పూర్తిగా విడుదల చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. అంతే కాకుండా చంద్రబాబు వృథా చేసిన నిధుల్ని కూడా.. అంటే ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ మరమ్మతుకు మరో రూ. 2 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపార”ని మార్గాని భరత్ వివరించారు.