ఒకప్పుడు సీనియర్ స్టార్ హీరోలతో దర్శకులుగా ఒక సినిమా చేయాలంటే, కొన్నేళ్ల పాటు వెయిట్ చేయవలసి వచ్చేది. హీరోల కంట్లో పడటం కోసం .. వాళ్ల పరిచయాల కోసం ఆల్రెడీ పేరున్న దర్శకుల దగ్గర ఏళ్లపాటు పనిచేస్తూ వెళ్లేవారు. ‘మావాడి దగ్గర ఒక కథ ఉంది .. వినండి సార్’ అని ఆ సీనియర్ డైరెక్టర్ చెబితే, అప్పుడు దర్శకులు ఆ వ్యక్తి చెప్పే కథను వినేవారు. ఆ హీరోలు చెప్పే మార్పులు .. చేర్పులు చేయడానికి మరికొంత కాలం పట్టేది. ఇలా అప్పట్లో ఒక స్టార్ హీరోతో సినిమా చేయడానికి అనేక పరీక్షలను దాటుకుంటూ వెళ్లవలసి వచ్చేది.
కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. కొత్తగా దర్శకత్వం వైపు వచ్చిన కుర్రాళ్లు, కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. లోకేశ్ కనగరాజ్ విషయానికి వస్తే, ‘ఖైదీ’ సినిమాతో ఆయన పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఒకటి రెండు సినిమాలతోనే ఆయన కమల్ ను ఒప్పించి, ‘విక్రమ్’ తో ఆయన కెరియర్లోనే భారీ వసూళ్లను సాధించిన సినిమాగా దానిని నిలబెట్టడం విశేషం. సినిమాకి సంబంధించి కథ .. స్క్రీన్ ప్లే .. దర్శకత్వ విభాగాలపై కమల్ కి మంచి పట్టుంది. అలాంటి కమల్ ను సైతం మెప్పించడం లోకేశ్ కనగరాజ్ గొప్పతనంగానే చెప్పుకోవాలి.
ప్రస్తుతం విజయ్ తో మరో సినిమా చేస్తున్న లోకేశ్, ఆ తరువాత రజనీతో ఒక సినిమాను ప్లాన్ చేస్తుండటం విశేషం. ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే, ప్రస్తుతం ‘సలార్’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పట్టాలపై ఉండగానే ఎన్టీఆర్ తో ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు. సౌత్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్టుల విషయంలో రాజమౌళి – శంకర్ తరువాత, ఇప్పుడు లోకేశ్ – ప్రశాంత్ పేర్లే వినిపిస్తున్నాయి. ఇలా స్టార్ డైరెక్టర్స్ ఒకరిని మించి మరొకరు భారీ ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూ ముందుకు వెళుతుండటం విశేషం.