చంద్రబాబు అరెస్ట్ పై ఆయన తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా కోనసీమలోని పొదలాడ వద్ద క్యాంపు సైట్ లో ఉన్న లోకేష్ బాబు అరెస్ట్ వార్త నేపథ్యంలో విజయవాడ బయల్దేరేందుకు సన్నద్దమయ్యారు. లోకేష్ ను పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకుగా తన తండ్రిని చూసే హక్కు ఉందని, తనను వెళ్ళనీయాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ఆకాశం ఉందని పోలీసులు చెప్పే ప్రయత్నం చేయగా… ఏపీ పోలీసులు బీహార్ కంటే దారుణంగా తయారయ్యారని, సిగ్గుండాలని తీవ్రంగా మండిపడ్డారు. సిఎం జగన్ అలవెన్సులు కట్ చేసి మంచి పని చేశాడని వ్యాఖ్యానించారు. అయినా పోలీసులు వినకపోవడంతో జాతీయ జెండాతో రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
అయితే కొద్దిసేపటి తర్వాత పోలీసులు లోకేష్ కు అనుమతి ఇవ్వడంతో ఆయన పాదయాత్రకు విరామం ప్రకటించి విజయవాడ బయలుదేరారు.