యువగళం పాదయాత్ర నిర్వహించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో రాష్ట్ర వ్యాప్త యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈనెల 11న ఇచ్చాపురం నుంచి శంఖారావం యాత్ర చేపడుతున్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. లోకేష్ యువగళం యాత్ర ప్రజల్లో చైత్యన్యం రగిల్చిందని, 220 రోజులు 3132 కిలోమీటర్ల పాటు సాగిన ఈ యాత్ర అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిందని అచ్చెన్న అన్నారు. రాయలసీమ, కోస్తాంధ్రలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 2150 గ్రామాల మీదుగా ఓ జైత్రయాత్రలాగా యువగళం సాగిందన్నారు. ఉత్తరాంధ్రలో కూడా ఈ యాత్ర సాగాల్సి ఉన్నా ఈ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబును అరెస్టు చేసిన నేపథ్యంలో 79 రోజుల పాటు విరామం ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు.
యువగళంలో పర్యటించలేకపోయిన అసెంబ్లీల్లో… ప్రజలకు, తెలుగుదేశం కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు నేటినుంచి శంఖారావం అనే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, మొన్నటి వరకూ ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ’ ద్వారా సమగ్రాభివృద్ధి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లామని, శంఖారావం ద్వారా ఆరు హామీలను వివరిస్తామని తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు తెలియజేశారు.
రానున్న 40-50 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా యువగళం జరగని 120 నియోజకవర్గాల్లో లోకేష్ శంఖారావం నిర్వహిస్తారని, ప్రతిరోజూ మూడు నియోజకవర్గాలు కవర్ చేస్తారని వివరించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో లోకేష్ ప్రత్యక్షంగా ముఖాముఖి ఉంటుందన్నారు.