తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర నేటికి 200 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ 2700కిలోమీటర్ల పాటు యాత్ర సాగింది. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి నియోజకవర్గంలోని సీతంపేట వద్ద 2700 కిలోమీటర్ల శిలాఫలాకాన్ని లోకేష్ తన తల్లి భువనేశ్వరిసమక్షంలో ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తెదేపా కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తానని లోకేష్ ఈ శిలా ఫలకం ద్వారా శ్రేణులకు హామీ ఇచ్చారు.
నేటి యాత్రలో నారా భువనేశ్వరి తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొని లోకేశ్ వెంట నడిచారు. మరోవైపు కొయ్యలగూడెం వద్ద పార్టీ కార్యకర్తలు లోకేశ్‌కు యాపిల్ గజమాలతో ఘన స్వాగతం పలికారు. రక్షా బంధన్ సందర్భంగా పలువురు మహిళలు లోకేష్ కు రాఖీ కట్టి అభినందనలు తెలియజేశారు.
‘యువగళం’ పాదయాత్ర నేడు 200 రోజులు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ పాదయాత్రలు నిర్వహించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ యాత్రల్లో తెదేపా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.