Friday, November 22, 2024
HomeTrending Newsఎన్నికల వ్యూహంలో కాంగ్రెస్... రాముడిపై బిజెపి భారం

ఎన్నికల వ్యూహంలో కాంగ్రెస్… రాముడిపై బిజెపి భారం

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి ఉపందుకుంది. శాసనసభ ఎన్నికల్లో ఓడిన నేతలు పార్లమెంటు ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దం అవుతున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా పార్లమెంటుకు వెళితే ఎలా ఉంటుందని అనుచరులతో చర్చిస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి పార్టీల్లో జోరుగా మంతనాలు జరుగుతున్నాయి.

బిజెపిలో అగ్రనేతలు పోటీకి సిద్దం అవుతున్నారు. ఆదిలాబాద్- సోయం బాపురావు, సినీ నటుడు అభినవ సర్దార్.. నిజామాబాద్ -ధర్మపురి అరవింద్, కరీంనగర్ – బండి సంజయ్, సికింద్రాబాద్ -కిషన్ రెడ్డిల టికెట్ ఖాయం కాగా హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే రాజ సింగ్, విరించి ఆస్పత్రుల డైరెక్టర్ కొంపెల్లి మాధవి లతల పేర్లు పరిశీలిస్తున్నారు. లోకసభ బరిలో నిలిస్తే మోడీ చరిష్మా…అయోధ్య రామాలయం ప్రభావంతో గట్టెక్కుతామని రాష్ట్రంలో అధిక శాతం నేతలు భరోసాతో ఉన్నారు.

రాష్ట్ర నేతలు ప్రజల సమస్యలపై పోరాటాలు చేయటం మానేసి…మీడియా సమావేశాల్లో విమర్శలకు పరిమితం అయ్యారని విమర్శ ఉంది. కాంగ్రెస్ వైఫల్యాలపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ తప్పితే ఎవరు స్పందించటం లేదు. శాసనసభ ఎన్నికలకు ముందు అన్నీ తానై ప్రజల్లోకి వెళ్ళిన ఈటెల రాజేందర్ జాడ లేదని పార్టీలో టాక్ మొదలైంది.

మరోవైపు రాష్ట్రంలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. ఎంపి సీట్లు అధికంగా గెలిచి రాహుల్ గాంధికి బహుమతిగా ఇవ్వాలని ముఖ్య నేతలు ఐకమత్యంగా మాట్లాడుతున్నారు. కెసిఆర్ ను లోక్ సభలో కూడా నిలువరిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ సుస్థిరం అవుతుందని హస్తం నేతలు గ్రహించారు. సిఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ శ్రేణులను అందరిని కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా రాష్ట్ర బిజెపి నేతలు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. రాష్ట్ర పార్టీకి అనేక రకాల ఇంచార్జ్ లు వచ్చారు. రాష్ట్ర నేతలు ఎవరి సూచనల మేరకు నడుచుకుంటున్నారో…ఎవరు ఎవరికి జవాబుదారి అర్థం కాని అయోమయం పార్టీలో నెలకొంది. శాసనసభ ఎన్నికల్లో ఓడిన నేతలకే లోక్ సభ సీట్లు ఇవ్వాలని ఢిల్లీ పెద్దలు యోచిస్తుండగా…ప్రజలు ఆదరిస్తారా అని చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్ తో బిజెపి లోపాయికారిగా ఒప్పందం చేసుకొని రెండు పార్టీలు తమకు అనువైన స్థానాల్లో సహకరించుకోవాలని చూస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలులోకి రాగా మిగతా వాటిని ఎన్నికల లోపు లబ్దిదారులకు అందించాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. ఎన్నికల హామీలను అమలు చేస్తే ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందని తద్వార లోకసభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తాయని హస్తం నేతల అంచనా.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్