Sunday, September 8, 2024
HomeTrending Newsదూకుడుగా సిట్... బీఎల్ సంతోష్ పై లుక్ ఔట్ నోటీసులు

దూకుడుగా సిట్… బీఎల్ సంతోష్ పై లుక్ ఔట్ నోటీసులు

టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా దుమారం లేపుతోంది. కేసు విచారణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడుగా వ్యవహరిస్తోంది. కేసులో విచారణ కోసం బిజెపి నేతలు బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామీలు కూడా విచారణకు రావాలని సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండగా వారు రాలేదు. దీంతో ఈ రోజు బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామీలపై సిట్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాల్ని తెలంగాణ పోలీసులు అప్రమత్తం చేశారు. బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామీలను సైబరాబాద్ పోలీసులు వాంటెడ్ జాబితాలో చేర్చారు.

బీజేపీ తరపున టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి మొయినాబాద్ ఫార్మ్ హౌజ్ లో కుట్ర చేసిన రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్ లు అడ్డంగా బుక్ అవడంతో వారి ప్లాన్ తలకిందులైంది. ఆ ముగ్గురు నిందితులు అరెస్టై ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ కేసు వ్యవ‌హారం అక్కడితో ఆగలేదు. వీరి ముగ్గురిని ఈ పని కోసం నియమించింది ఎవరనే విషయం చర్చకొచ్చింది. ఈ కేసు పై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసు వెనక ఉన్న అన్ని విషయాలను తవ్వడం మొదలు పెట్టింది. ఈ ముగ్గురు మొయినాబాద్ ఫార్మ్ హౌజ్ నుండి టీఆరెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినప్పుడు చెప్పిన మాటల ఆధారంగా దీని వెనక ఉన్నది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అని అనుమానిస్తున్నారు. రామచంద్ర భారతి సంతోష్ గురించి అనేక సార్లు ప్రస్తావించాడు. దాంతో సిట్ బృందం తమ ముందు విచారణకు హాజరుకావాల్సిందిగా సంతోష్ కు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఈ వ్యవ‌హారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సంతోష్ కు నోటీసులు ఇవ్వడమే తప్పంటూ తెలంగాణ బీజేపీ నాయకులు హైకోర్టు ను ఆశ్రయించారు. వారి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో కమలనాథులు సంతోష్ ను ఈ కేసునుంచి రక్షించడంలో తలమునకలై ఉన్నారు.

బీఎల్ సంతో ష్ పూర్తి పేరు బొమ్మరబెట్టు లక్ష్మీ జనార్ధన్ సంతోష్ . కర్నాటకకు చెందిన ఇతను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)లో అతి ముఖ్యమైనవాడు. RSS ద్వారా బీజేపీలోకి ప్రవేశించిన వాడు. ఇతను బీజేపీకి ఆరెస్సెస్ కు వారధి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను మార్చాలన్నా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్య మంత్రులను మార్చాలన్నా ఆసలా పార్టీలో ఏం జరగాలన్నా, ఆ పార్టీలో అందరూ సంతోష్ జీ అని పిల్చుకునే బీఎల్ సంతోష్ అనుమతి తప్పని సరి. చివరకు గవర్నర్ల నియామకాలు కూడా ఆయన సూచనల మేరకే జరుగుతాయన్న వాదన కూడా ఉంది. నిజం చెప్పాలంటే ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కన్నా పవర్ ఫుల్ ఈ సంతోష్.

Also Read : బిజెపి నేత బిఎల్ సంతోష్ కు హైకోర్టులో ఉపశమనం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్