CM- Manchu: తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకోనున్నారు. ఇప్పటికే విష్ణు తాడేపల్లి చేరుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి రంగంలోకి దిగడం, సంక్రాంతి ముందురోజు సిఎం తో చిరు భేటీ కావడం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా గత వారం చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్. నారాయణ మూర్తి, పోసాని కృష్ణ మురళి, అలీ… సిఎం జగన్ ను కలుసుకున్నారు. సినిమా టిక్కెట్ల రేట్లను సవరించేందుకు, ఐదవ షో ప్రదర్శించేందుకు సమావేశంలో సిఎం సుముఖత వ్యక్తం చేశారు.
అయితే ఈ సమావేశానికి మా అధ్యక్షుడిగా మంచు విష్ణుకి గానీ, సీనియర్ నటుడు మోహన్ బాబుకు గానీ ఆహ్వానం లేకపోవడం చర్చనీయాంశమైంది. మంచు కుటుంబంతో సిఎం జగన్ కు దగ్గరి బంధుత్వం ఉన్న నేపథ్యంలో సినీ పరిశ్రమకు సంబంధించిన కీలక సమావేశాలపై వారికి సమాచారం కూడా లేకపోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది. ఈ భేటీకి బాలకృష్ణ, మోహన్ బాబులను చిరంజీవి స్వయంగా ఆహ్వానించినా వారు ఆసక్తి చూపలేదని మరో వాదన కూడా ఉంది. ఆ తర్వాత మంత్రి పేర్ని నాని మోహన్ బాబు ఇంటికెళ్ళి కలుసుకోవడం కూడా గమనార్హం. ఎట్టకేలకు నేడు విష్ణు సిఎంతో సమావేశం కానుండడంతో సమస్యల పరిష్కారంలో ‘మా’ ను కూడా పరిగణనలోకి తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read : నెలాఖరులోపు సానుకూల నిర్ణయం: చిరు