Sunday, November 24, 2024
HomeTrending NewsBRS vs BJP: ప్రధాని మోడీ అబద్దాల ప్రసంగం - కేటీఆర్ ఎద్దేవా

BRS vs BJP: ప్రధాని మోడీ అబద్దాల ప్రసంగం – కేటీఆర్ ఎద్దేవా

ప్రధానమంత్రి మోడీ పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రధానమంత్రి ప్రస్తావించిన అభివృద్ధి కార్యక్రమాల నుంచి మొదలుకొని తన ప్రసంగం మొత్తం అసత్యాలతో కొనసాగిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేవలం ఇక్కడి ప్రభుత్వంపైన అవాకులు చవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడడం అలవాటుగా మారిందన్నారు.   ప్రధాన మంత్రి మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయగలరో చెప్పకుండా, ఉపన్యాసం ఇచ్చి ఉత్త చేతులతో వెళ్లిపోవడం పరిపాటిగా మారిందన్నారు.   గత తొమ్మిది సంవత్సరాలలో అడుగడుగునా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని గుర్తుంచుకొని, రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఆ పార్టీని తెలంగాణ నుంచి ప్రజలు తన్ని తరిమేస్తారని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు.

45 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, డిమాండ్ అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రైల్వే రిపేర్ షాప్ పేరుతో ప్రధానమంత్రి తెలంగాణ ప్రాంతానికి ఏదో గొప్ప మేలు చేసినట్లు చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమే  అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పట్టించుకోకుండా తన సొంత రాష్ట్రానికి 20 వేల కోట్ల రూపాయల లోకోమోటివ్ ఫ్యాక్టరీని మోసపూరితంగా తరలించుకుపోయిన ప్రధానమంత్రి మోడీ సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ అనే నినాదం.. గుజరాత్ కా సాత్, గుజరాత్ కా వికాస్ గా మారిపోయిందని మండిపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాదిరిగా అనర్గళంగా అబద్ధాలు చెప్పాలంటే చాలా ధైర్యం కావాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధానమంత్రి మాటలు ఏమయ్యాయో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకువచ్చి, 700 రైతుల మరణాలకు కారణమైన ప్రధానమంత్రి ఈరోజు వ్యవసాయ రంగం గురించి మాట్లాడడం దుర్మార్గం అన్నారు.  తెలంగాణ వ్యవసాయ రంగం అన్ని సూచీల్లోనూ ముఖ్యంగా,  ఆహార ధాన్యాల ఉత్పత్తి నుంచి మొదలుకొని  పెరిగిన విస్తీర్ణం,  సాగునీటి విప్లవం, రైతు సంక్షేమ పథకాల వరకు ప్రతి అంశంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న విషయం ప్రధానమంత్రి మోడీ తెలుసుకుంటే మంచిది అని హితవు పలికారు.  కార్పొరేట్ మిత్రులకు పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిన ప్రధానమంత్రి దేశంలోని రైతుల రుణాలన్నింటిని మాఫీ చేసే అవకాశం ఉన్నా, ఎందుకు ఇప్పటిదాకా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కార్యక్రమాల పైన కేంద్ర ప్రభుత్వ  ఏజెన్సీలతో విచారణ చేపిస్తామంటూ ప్రధానమంత్రి అన్న మాటల పైన కేటీఆర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు తాము భయపడే ప్రసక్తే లేదని, ఇలాంటి ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులతో కలవరపడే ప్రభుత్వం, నాయకత్వం మాది కాదని స్పష్టంచేశారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం మహాయజ్ఞంలా కృషిచేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్