Saturday, January 18, 2025
HomeTrending Newsమహబూబాబాద్ లో ఎవరు గెలిచినా రికార్డే

మహబూబాబాద్ లో ఎవరు గెలిచినా రికార్డే

మహబూబాబాద్ నియోజకవర్గానికి ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ST రిజర్వుడ్ స్థానమైన ఇక్కడి నుంచి బిజెపి నుంచి మాజీ ఎంపి ఆజ్మీరా సీతారాం నాయక్, కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపి మలోత్ కవిత పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు సుమారు 14 లక్షల 28 వేల వరకు ఉన్నారు.

ములుగు, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట్, భద్రాచలం, పినపాక, ఇల్లందు శాసనసభ స్థానాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. భద్రాచలం మినహా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇటీవల భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ ముఖ్యనేతలతో టచ్ లో ఉన్నారు.

మహబూబాబాద్ నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు లంబాడా సామాజిక వర్గం వారే కావటంతో ఆదివాసీల్లో అసంతృప్తి నెలకొంది. నాలుగు లక్షల పైచిలుకు ఆదివాసి ఓట్లు ఉండగా ప్రధాన పార్టీలు తమను విస్మరించాయని ఆదివాసీలు మండిపడుతున్నారు. దీంతో తుడుందెబ్బ నుంచి స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దించాలని చర్చలు జరుగుతున్నాయి.  కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ చందా లింగయ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానని అంటున్నారు.

లంబాడాలను ST జాబితా నుంచి తొలగించాలని తుడుందెబ్బ ఆధ్వర్యంలో నలభై ఏళ్ళుగా ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మైపతి అరుణ్ కుమార్ పోటీ చేస్తానని అంటున్నారు. 2019లో అరుణ్ తెలంగాణ జన సమితి నుంచి పోటీ చేసి 57 వేల పైచిలుకు ఓట్లు సాధించారు.

మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట్ పరిధిలో లంబాడ ఓటర్లు గణనీయంగా ఉండగా.. భద్రాచలం, పినపాక, ములుగు నియోజకవర్గాలతో పాటు ఇల్లందు పరిధిలో ఆదివాసీల ప్రభావం ఉంటుంది. రాష్ట్ర స్థాయి సమీకరణాలతో ఒకటి ఆదివాసీలకు, ఒకటి లంబాడ వర్గానికి టికెట్ ఇవ్వటం సరికాదని తుడుందెబ్బ నేతలు రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నారు.

తుడుందెబ్బ నేతలు స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా ప్రధాన పార్టీల నుంచి టికెట్ సాధిస్తే గెలుపు వారిదే అని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. మొదటి నుంచి ఆదిలాబాద్ ఆదివాసీలకు.. మహబూబాబాద్ లంబాడాలకు రాజకీయ పార్టీలు కేటాయిస్తు వస్తున్నాయి.

ST రిజర్వు అయ్యాక 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బలరం నాయక్ గెలిచి కేంద్ర సహాయమంత్రిగా యుపియే ప్రభుత్వంలో సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. 2014లో ఆజ్మీరా సీతారాం నాయక్ ప్రాతినిధ్యం వహించగా 2019లో మాలోత్ కవిత గెలిచారు.

మహబూబాబాద్ లో ఈ దఫా పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య ఓ సారుప్యత ఉంది. ST రిజర్వు అయ్యాక ఈ స్థానం నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు చెరి ఒకసారి గెలిచారు. ఒక దఫా గెలిచిన వారే ఇప్పుడు అద్రుష్టం పరీక్షించుకుంటున్నారు. ముగ్గురిలో ఎవరు గెలిచినా రెండోసారి గెలిచిన రికార్డు సొంతం చేసుకోనున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్