మహబూబ్‌నగర్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన రామయ్య బౌలి, ఎర్రగుంట, తదితర లోతట్టు ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. మోకాలు లోతు నీళ్లలో దిగి ప్రజల సమస్యలను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
వర్ష బాధితులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. గత 2 రోజులుగా ఎప్పుడు లేనంత వర్షం కురవడం వల్ల పెద్ద ఎత్తున వర్షపు నీరు వస్తున్నదని మంత్రి తెలిపారు. నిర్వాసితులకు పునరావాసం కోసం ప్రత్యేకంగా 3 ఫంక్షన్ హాల్స్ వద్ద పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒకప్పుడు చెరువులు ఎండిపోయి ఉండేవని, గత కొన్నేండ్లుగా పచ్చదనం పెరిగి భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆయన తెలిపారు. వరద ముంపు నుంచి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇండ్లలో ఉండకుండా ఫంక్షన్ హాల్స్ వద్దకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.