Friday, November 22, 2024
HomeTrending Newsమల్కజ్ గిరిపై ప్రధాన పార్టీల గురి

మల్కజ్ గిరిపై ప్రధాన పార్టీల గురి

దేశంలో అత్యధిక ఓటర్లు ఉన్న లోక్ సభ నియోజకవర్గముగా మల్కజ్ గిరి పేరొందింది. 31 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్న ఈ లోక్ సభ నియోజకవర్గాన్ని మినీ భారత్ అని కుడా అంటారు. శివారు ప్రాంతాల్లో విస్తరించిన మల్కాజ్ గిరిలో పారిశ్రామిక వాదాలు అధికం కాగా కార్మిక వర్గాల ఓట్లు కీలకంగా ఉన్నాయి.

ఈ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున మాజీమంత్రి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మా రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరు గెలిచినా లోక్ సభకు మొదటిసారి వెళుతున్న వారు కావటం గమనార్హం.

దీని పరిధిలో మల్కజ్ గిరి, ఉప్పల్, మేడ్చల్, కూకట్ పల్లి, కుత్భుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఎల్.బి నగర్, సిక్రంద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గంలోని అన్ని సీట్లు బీఆర్ఎస్ గెలుచుకోగా ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక జరుగుతోంది.

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మల్కజ్ గిరి ఏర్పడగా మొదటిసారిగా జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సర్వే సత్యనారాయణ విజయం సాధించారు. 2014లో టిడిపి నుంచి చామకూర మల్లారెడ్డి గెలవగా 2019లో రేవంత్ రెడ్డి గెలుపుబావుటా ఎగురవేశారు. మూడు ఎన్నికలు పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకే బలం ఉంది.

బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తుండగా అగ్రనేతలు ప్రచారానికి వస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు ప్రచారంలో అంతగా పాల్గొనటం లేదు. నియోజకవర్గంలో పార్టీ నేతలు ఒకరొకరుగా కాంగ్రెస్ లోకి వెళ్ళగా ఇటీవల ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కూడా జంప్ అయ్యారు. ఇలా గులాబీ దళం పలుచబడుతోంది.

అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నా పార్టీ ప్రచారం ప్రజలను ఆకట్టుకోవటం లేదు. మొదట్లో కేటిఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినపుడు క్యాడర్ లో కొంత ఉత్సాహం ఉండింది. ఇప్పుడు ఆ జోష్ లేదు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు స్థానికేతర నేతలని.. తాను లోకల్ అంటూ లక్ష్మారెడ్డి ప్రచారం చేస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డిని పోటీకి నిలిపారు. సునీత గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి కొందరు కీలక నేతలు రావటం… పార్టీ అధికారంలో ఉండటం అభ్యర్థికి కలిసి వచ్చే అంశం. ముఖ్యంగా సిఎం రేవంత్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ ఎంపి కావటంతో ఆ ప్రభావంతో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.

శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా.. ఈ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం.. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సాధించడం కాంగ్రెస్ కు పెద్ద సవాల్. మల్కజ్ గిరికి రుణపడి ఉంటానని వివిధ సందర్భాల్లో పేర్కొన్న రేవంత్ రెడ్డి… హస్తం గుర్తును గెలిపించండి..అభివృద్ధి నేను చూసుకుంటా అని ఓటర్లకు భరోసా ఇస్తున్నారు.

బిజెపి నుంచి మాజీమంత్రి ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు. పార్టీ స్థానిక నేతల్లో ఈటెల అభ్యర్థిత్వంపై కొంత అసంతృప్తి ఉంది. పార్టీ కోసం ఎప్పటినుంచి కష్టపడ్డవారిని వదిలేసి బయట వారికి ఇస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటెల ప్రచారం  గుంబనంగా సాగుతోంది. టిఫిన్ బైటక్ లు.. కాలనీ సంఘాలతో సమావేశాలు.. ఇలా ఈటెల సోలోగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ నియోజకవర్గంలో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల వారు గణనీయంగా ఉంటారు. సహజంగా ఉత్తర భారతీయులు ఇక్కడ బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాతో గట్టెక్కుతామని కమలం నేతలు కులాసాగా ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో ఒక్క బిజెపి ఎమ్మెల్యే లేకపోయినా ఆ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషణలు జరుగుతున్నాయి.

హైదరాబాద్ నగరానికి తూర్పు వైపున ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపును సెంటిమెంట్ గా భావిస్తుంటారు నేతలు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో ఇఫ్పటివరకు బీఆర్ఎస్, బీజేపీలు బోణీ కొట్టనేలేదు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు కాంగ్రెస్, ఒకసారి టీడీపీ గెలుపొందాయి. ఈసారి మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి.

ఇప్పటివరకు మల్కాజ్ గిరిపై కాషాయ జెండా ఎగరకపోవడంతో ఈసారి ఖచ్చితంగా గెలిచితీరాలనే కసితో బీజేపీ అగ్రనేతలు పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపకపోవడం బీజేపీకి మైనస్. నాలుగు లక్షల ఓట్లు కూడా సాధించకపోవడం… గత మూడు ఎన్నికల్లోనూ నిరాశజనక ఫలితాలే బిజెపి మూటగట్టుకుంది.

గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఎమ్మెల్యేల దన్నుతో మల్కజ్ గిరి గెలిచి సిఎంకు షాక్ ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. సిట్టింగ్ స్థానం నిలుపుకొని సుస్థిరం చేసుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మినిభారత్ మోడీ వికసిత్ భారత్ కు మద్దతుగా నిలుస్తుందని బిజెపి భరోసా. ఎన్నికల ప్రచార సరళి పరిశీలిస్తే కాంగ్రెస్ – బిజెపిల మధ్య పోటీ నెలకొందని పరిశీలకులు అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్