మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష స్ధానానికి పోటీపడుతున్న మంచు విష్ణు తన మ్యానిఫెస్టో ప్రకటించారు.
1) అవకాశాలు: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న కొంత మంది సభ్యులు సినిమాల్లో అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మా యాప్ క్రియేట్ చేసి ఐఎండిబి తరహాలో ప్రతి ఒక్క మా సభ్యుల పోర్ట్ పోలియో క్రియేట్ చేస్తాం. మా యాప్ యాక్సిబిలిటి నిర్మాతలకు, దర్శకులకు, రచయితలకు మరియు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కి ఉండేలా చూస్తాం. జాబ్ కమిటీ ద్వారా వారదరికీ సినిమాలు, ఓటీటీ వంటి వివిధ మాధ్యమాల్లో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం.
2) మా భవనం: తెలుగు కళామతల్లి ఆత్మగౌరవం ఉట్టిపడేలా మాలో ఉన్న ప్రతి సభ్యుడికి ఉపయోగపడే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో మా సొంత భనవం నిర్మాణం.
3) సొంత ఇంటి కల: అర్హులైన మా సభ్యులకు ప్రభుత్వ సహకారంతో శాశ్వత గృహ నిర్మాణం.
4) వైద్య సహాయం: ‘మా’లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి, కుటుంబ సభ్యులందరికీ సమగ్రమైన ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అందచేస్తాం. పలు కార్పోరేట్ హాస్పటల్స్ తో అనుసంధానమై మా కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఉచిత మెడికల్ టెస్ట్ లు చేయిస్తాం. ప్రతి ఒక్క మా సభ్యుడికి ఉచితంగా ఈఎస్ఐ హెల్త్ కార్డులు అందిస్తాం. ఇప్పటికే 946 మంది మా సభ్యులు (అసోసియేట్ మెంబర్స్ తో సహా) ఉన్నారు.
ప్రస్తుతం ఒక్కొక్కరి పేరిట మూడు లక్షల జీవిత భీమా అమల్లో ఉంది. దీనిని గణనీయంగా పెంచుతాం.
5) చదువుల తల్లి: అర్హులైన మా సభ్యుల పిల్లలకు కేజీ టు పీజీ వరకు విద్యా సహాయం
6) కళ్యాణ లక్ష్మి: అర్హులైన మా సభ్యులకు మా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్షా పదహారు వేల ఆర్థిక సహాయం కొనసాగిస్తాం
7) మహిళ రక్షణ హైపర్ కమిటీ: మా చరిత్రలో మొట్ట మొదటి సారిగా మా మహిళా సభ్యుల సంక్షేమం మరియు రక్షణ కోసం హైపర్ కమిటీ ఏర్పాటు చేస్తాం. వయసుతో సంబంధం లేకుండా అర్హులైన అందరికీ ఆర్థిక సహాయం చేస్తాం. వారికి మా ద్వారా సంపూర్ణ భరోసా కల్పిస్తాం.
8) వృద్థ కళాకారుల సంక్షేమం: మేము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రస్తుతం పెన్షన్ కోసం పెట్టుకున్న దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హులైన వారందరికీ ప్రతి నెలా పెన్సన్లు అందేలా చేస్తాం. అలాగే 6 వేలు ఉన్న పెన్షన్ గణనీయంగా పెంచుతాం. అంతేకాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ప్రభుత్వపరంగా ఉన్న పెన్షన్ పథకాలు, ఎన్బిఎఫ్సి లో ఉన్న పథకాలు మన సభ్యులకు కూడా అందేలా చేస్తాం.
9) ఓటు హక్కు: గౌరవ సభ్యత్వం ఇచ్చిన సీనియర్ సిటీజన్స్ కు ఓటు హక్కు వచ్చేలా ఏజీఎంలో ఆమోదం తెచ్చుకుని అమలు చేస్తాం.
10) మా మెంబర్ షిప్ కార్డ్: కరోనా వలన కళాకారులు అందరూ ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురయ్యారు. కమిటీ ఆమోదంతో ఆర్థికంగా వెనకపడ్డ యువతను ప్రొత్సహించడానికి కొంత కాల పరిమితి వరకు మా మెంబర్ షిప్ ని 75 వేలకు తగ్గించి ఇస్తాం.
11) మా ఉత్సవాలు: ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చురుకుగా చేపట్టడానికి ఒక కల్చరల్ అండ్ ఫైనాన్స్ కమిటీని ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు నిర్వహించి మా ని ఆర్ధికంగా బలపరుస్తాం. మా నటీనటులందరం కలిసి మా ఉత్సవాలను ఒక పండుగలా జరుపుకుందాం.
12) కేంద్ర, రాష్ట్ర పథకాలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని సంప్రదించి అర్హులైన కళాకారులందరికీ ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అందేలా చేస్తాం.
13) మోహన్ బాబు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్: మా సభ్యుల పిల్లలకు సినిమాల పట్ల అభిరుచి ఉన్నచో మోహన్ బాబు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ద్వారా యాభై శాతం స్కాలర్ షిప్ తో శిక్షణ ఇప్పించడమే కాకుండా పలు పేరొందిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో తగినంత డిస్కౌంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం.
14) ప్రభుత్వాల సహాయ సహకారాలు: మా ఎన్నికల్లో మేము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుసుకుని వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుని మన తెలుగు చలన చిత్ర సమస్యల పరిష్కారాలకి దాని అభివృద్థి ప్రణాళికలకు వారి సంపూర్ణ సహాయ సహకారాలను అభ్యర్థిస్తాం.
పైన చెప్పిన ప్రతొ ఒక్క వాగ్థానాన్ని నెరవేర్చడానికి నన్ను నా ప్యానల్ సభ్యులందరిని గెలిపించవలసిందిగా ప్రార్థన అంటూ మంచు విష్ణు తన ప్యానల్ మ్యానిఫెస్టో ప్రకటించారు.