వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రెండోరోజూ నిరసన వెల్లువైంది. సేవే లక్ష్యంగా భావించి, గౌరవవేతనంతో ప్రజలకు సేవ చేస్తున్న తమపై చేసిన ఈ వ్యాఖ్యలు ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఈ వ్యాఖ్యలపై వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఓ దళిత మహిళ వాలంటీర్ కాళ్లు కలిగి పాదపూజ చేసి సత్కరించారు. మంగళవారం దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన దళిత మహిళా వాలంటీర్ జె రజిత కు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) కాళ్లు కడిగి పాదపూజ చేసి సన్మానించారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాల వారు వాలంటీర్లుగా వచ్చి అతి తక్కువ గౌరవ వేతనంతో ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రపంచం మొత్తం ప్రాణభయంతో వణికిపోతున్న వేళ వాలంటీర్లు ప్రాణాల సైతం ప్రణంగా పెట్టి ముందుకు వచ్చి ప్రజలకు సేవలు అందించారని ఆర్కే గుర్తు చేశారు. బయటికి రాలేని వృద్ధులకు, నడవలేని వికలాంగులకు ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు అందిస్తూ వారి ఆదరాభిమానాలు పొందుతున్నారని, ఇలాంటి వాలంటీర్ల పై రాజకీయ ప్రయోజనాల కోసం అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని సూచించారు.