మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. తన సోదరుడు అయోధ్య రామిరెడ్డి, మంగళగిరి సమన్వయకర్త గంజి చిరంజీవిలతో కలిసి ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ ను కలుసుకున్నారు.
గత డిసెంబర్ 11న తన శాసనసభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేసిన ఆర్కే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జనవరి 21న కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళగిరి స్థానం నుంచి వేరొకరికి అవకాశం ఇస్తున్నట్లు రెండేళ్ళ క్రితమే సిఎం జగన్ ఆర్కేకు సూచన ప్రాయంగా చెప్పారు. అయితే అధికారపార్టీ ఎమ్మెల్యేగా నియోజజవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానని, నిధుల విడుదలలో జాప్యం జరిగిందని ఆరోపిస్తూ తన పదవులకు రాజీనామా చేశారు. ఆర్కే సోదరుడు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉంటూ వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో సోదరుడు ఆర్కే వేరొక పార్టీలో ఉండడం ఆయనకు ఇబ్బందిగా మారింది. తన సోదరుడి తో పలుసార్లు దీనిపై చర్చలు జరిపారు, మరోవైపు రెండ్రోజుల క్రితం వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి కూడా హైదరాబాద్ లో ఆర్కేను కలుసుకుని మంతనాలు చేశారు. గతంలో నెలకొన్న అభిప్రాయ బేధాలు, సమస్యలపై జగన్ తో కలిసి ఓ సానుకూల పరిష్కారం కనుగొందామని, తిరిగి పార్టీలో చేరాలని విజయసాయి సూచించారు. దీనితో మెత్తబడ్డ ఆర్కే ఘర్ వాపసీ నిర్ణయం తీసుకున్నారు.
గత ఎన్నికల్లో నారా లోకేష్ ను ఓడించి ఆర్కే తన పట్టు నిరూపించుకున్నారు. 2019లో కూడా లోకేష్ మంగళగిరి నుంచే పోటీకి సిద్దమవడంతో ఇక్కడ వైసీపీ అభ్యర్ధి గెలుపు బాధ్యతను ఆర్కేకు జగన్ అప్పగించారు.