మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసియార్ అవలంబిస్తున్న ఫ్యూడల్, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నఈటెల రాజేందర్ బిజెపిలో చేరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ లేఖ విడుదలైంది.
హిందుత్వ పార్టీ అయిన బిజెపిలో ఈటెల చేరడాన్ని ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజా సంఘాల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని జగన్ లేఖలో వెల్లడించారు. తనకు ఆర్ ఎస్ యూ, మావో యిస్టులు మద్దతిస్తారని ఈటెల చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
ఏడేళ్ళపాటు మంత్రిగా కేసియార్ పక్కన ఉన్న ఈటెల ఆస్తులు పెంచుకున్నారని, అందులో భాగంగానే అసైన్డ్ భూములు ఆక్రమించుకున్నారని, ఇప్పుడు ఆ ఆస్తుల రక్షణ కోసమే బిజెపిలో చేరారని జగన్ విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా చేయడాన్ని మావోలు ఖండించారు. ఇది కేసియార్- ఈటెల మధ్య జరుగుతున్న పోరాటం తప్ప తెలంగాణా ప్రజలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కెసియార్, ఈటెల ఇద్దరూ ఒకే గూటి పక్షులని, తెలంగాణ ప్రజల అకాంక్షలకు తూట్లు పొడిచారని ఆరోపించారు.