-0.2 C
New York
Wednesday, November 29, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనెగటివ్ వార్తలతో పెరుగుతున్న పాజిటివ్!

నెగటివ్ వార్తలతో పెరుగుతున్న పాజిటివ్!

Positive News vs Negative News : 

తరంగ దైర్ఘ్యం అని ఒక పారిభాషిక పదముంది. శతాబ్దాలపాటు వాడిన తెలుగు మాట ఇది. నిజానికిది సంస్కృత సమాసం. ఇప్పుడు మనం తెలుగువాళ్లమే అయినా అచ్చ తెలుగు అసలు అర్థం కాదు. సంస్కృతం అంటరానిది. తెలుగు మాటలు వాడాలంటే నామోషీ. కాబట్టి తరంగ దైర్ఘ్యం మాటను వేవ్ లెంగ్త్ అని ఇంగ్లీషులో చెబితేనే టక్కున అర్థమవుతుంది. అయినా మన గొడవ భాష గురించి కాదు. కరోనా వేవ్ ల గురించి.

కరోనా వేవ్ అంటే చాచి మొహం మీద కొట్టినట్లు బలంగా ఉంటుంది. అదే తెలుగులో కరోనా తరంగం అంటే బాగోదు.
తారంగం తారంగం తాండవ కరోనా తారంగం… అని కరోనా తరంగాన్ని ఒళ్లో పెట్టుకుని జోల పాడుతున్నట్లు అసహ్యంగా ఉంటుంది.

కరోనా వేవ్ అన్న ఇంగ్లీషు మాటకు కరోనా దశ అని అనడమే ఉత్తమం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ మాటలకు మొదటి దశ, రెండో దశ, మూడో దశ అని అనువదించుకోవచ్చు.

తమిళుల్లా సొంతభాషలో ఎప్పటికప్పుడు పారిభాషిక పదాలు సృష్టించుకోవాలని మనకు పట్టింపు లేదు కాబట్టి- ఎన్ని వేవ్ లు మనల్ను వేపుకుతిన్నా మనకేమీ ఫరక్ పడదు.

ఈమధ్య న్యూస్ ఛానెల్ డిబేట్లలో ఒకాయనేమో ఇంటికొక పీనుగ తప్పదంటాడు. ఇంకొకాయనేమో థర్డ్ వేవ్ తో కలియుగాంతమంటాడు. మరొక నిపుణుడేమో మొదటి వేవ్ ముసలిని మింగింది, రెండో వేవ్ పడుచులను మింగింది, మూడో వేవ్ పిల్లలను మింగేస్తుంది అంటాడు.

వైద్యం చదివిన డాక్టర్లేమో వారి పని వారు చేసుకుంటున్నారు. వైద్యం చదవని మీడియా వైద్యానికి భాష్యం చెబుతోంది. సోషల్ మీడియా సరే సరి.

సంవత్సరం రోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా కరోనాను ఫుట్ బాల్ ఆడుకున్నా- ఇంకా కరోనా బతికి ఉండడం నిజంగా ఊహకందని విషయం! ఇంతకాలం అన్ని రకాల మీడియాల్లో వచ్చిన కరోనా విజ్ఞానాన్ని గుదిగుచ్చితే ఇలా ఉంటుంది.

Positive News vs Negative News : 

1. పారాసెటమాల్ వేసుకుని, ఇళ్ల ముందు క్లోరిన్ చల్లుకుంటే కరోనా దానంత అదే నామరూపాల్లేకుండా పోతుంది.

కరోనా ఇప్పట్లో పోదు. ఎప్పటికీ పోయేలా లేదు. కరోనాతో సహజీవనం చేయాల్సిందే.

2. బాల్కనీలో చప్పట్లు కొట్టి, కొవ్వొత్తులు వెలిగిస్తే కరోనా ఏమీ చేయలేదు.

కరోనాను చప్పట్లు, కొవ్వొత్తులు ఏమీ చేయలేవు.

3. కరోనాకు వ్యాక్సిన్ రాష్ట్రాలే కొనుక్కోవాలి. కాదు-కేంద్రమే కొని రాష్ట్రాలకు ఇస్తుంది. ధర ఫార్మా కంపెనీల ఇష్టం. కాదు కాదు-కేంద్రం చూస్తుంది. పొరపాటు-కేంద్రం చూడదు. సవరణ-కేంద్రం పర్యవేక్షిస్తుంది. పునస్సవరణ-ప్రయివేటుకు ఇచ్చుకునే వ్యాక్సిన్ ధరలను కేంద్రమే నిర్ణయిస్తుంది. పునః పునస్సవరణాత్మక వివరణ- దేశం మొత్తానికి వ్యాక్సిన్ కేంద్రమే ఉచితంగా ఇస్తుంది.

4. మొదటి వేవ్ అయ్యాక రెండో వేవ్ ఖచ్చితంగా వస్తుంది. రెండో వేవ్ ముగియగానే మూడో వేవ్ వద్దన్నా వస్తుంది. మూడో వేవ్ ఎప్పుడు ముగిస్తే నాలుగు వేవ్ అప్పుడు వస్తుంది. వేవ్ వచ్చినప్పుడే వచ్చినట్లు తెలుస్తుంది. రానప్పుడు వేవ్ కోసం నిరీక్షించాల్సి వస్తుంది. వచ్చాక వేవ్ పోయేవరకు నిరీక్షించాల్సి వస్తుంది.

5. ఒక మాస్కు పని చేయదు. సర్జికల్ మాస్క్ ఒకటి, మామూలు మాస్క్ ఒకటి ఒకేసారి రెండు పెట్టుకోవాలి. మూడు మాస్కులయితే ఇంకా మంచిది. మొదటి వేవ్ కు ఒక మాస్క్, రెండో వేవ్ కు రెండు చొప్పున ఎన్నో వేవ్ నడుస్తుంటే అన్ని మాస్కులు పెట్టుకోవాలి. మాస్కులెక్కువై ఊపిరి ఆగిపోతే- మాస్కులు మేలిమి రకానివి అని సాంకేతికంగా రుజువవుతుంది. మ్యాచింగ్ మాస్కులు వేసుకోని వారు నాగరికులు కారు.

6. లాక్ డౌన్, కర్ఫ్యూలు వస్తుంటాయి . పోతుంటాయి. ప్రాణాలు పోతుంటాయి. అదృష్టం బాగుంటే బతికిపోతుంటాయి. ఆరోగ్యంగా ఉన్నా పోవచ్చు. అనారోగ్యంగా ఉన్నా పోవచ్చు. ఎలా ఉన్నా పోవచ్చు. శ్మశానాల చితిలో బూడిద కావడం కోసం శవాలు క్యూలో ఉండాల్సి రావచ్చు.

7. ఆత్మనిర్భర భారత్ లో ఆత్మలకు కూడా ప్రతీకాత్మక ప్రత్యేక రాయితీలు కనపడతాయి. వినపడతాయి. ఆత్మలకు శరీరం ఉండదు కాబట్టి ప్రతీకలు అందవు. ప్రాణి-దేహం-ఆత్మ పారమార్థిక విషయాలు. ఎంత అర్థమయితే అంత అయోమయం. శరీరానికి ప్రాణం ఉన్నట్లే- ఆత్మకు అంతరాత్మ ఉంటుందని అనుకుంటే చాలు. తరువాత పథకం- అంతరాత్మ నిర్భర ప్రతీకాత్మక్ భారత్ అభియాన్.

8. బయట కరోనా అకెడెమిక్ గా ఉంటుంది. ఎన్నికలకు కరోనా ఉండదు.

9. కరోనా వేళ ఫార్మా, కార్పొరేట్ ఆసుపత్రుల “సేవలు” రాయడానికి గుండె ధైర్యం ఉండాలి.

10. నిత్యం నెగటివ్ కోసం ఎదురు చూడడమే ఇప్పుడు పరమ పాజిటివ్ దృక్పథం కాబట్టి- మీడియా నెగటివ్ వార్తలనే ఇస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది.

ఉన్నతోన్నత మీడియా వేవ్ లెంగ్త్ అర్థం చేసుకోవడానికి పాఠకులు పాతాళం కింది నుండి పైపైకి ఎదగాలో?
మీడియా లోతులను అందుకోవడానికి పాతాళం అంచుల్లోకి దిగాలో?
ఇది తెలిసిన తరంగ దైర్ఘ్యం కాదు.
తెలుసుకోవడానికి తరంకాని తరతరంగ దైన్యం.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : నిజంగానే ఓ అబద్ధం……. ఆ అబద్దమే ఓ నిజం……. అదే సోషల్ మీడియా…….

RELATED ARTICLES

Most Popular

న్యూస్