చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు మెగాభిమానులను కోరారు. ఈ మేరకు అయన ఓ ప్రకటన విడుదల చేశారు.
‘మొక్కవోని దీక్షతో మొక్కలు నాటండి… పర్యావరణాన్ని కాపాడండి’….ఈసారి మన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో అభిమానులంతా ఆచరించాల్సిన బృహత్తర కార్యక్రమం. ఆగష్టు 22 చిరంజీవి పుట్టినరోజు సంగతి ప్రత్యేకించి ప్రస్తావించనవసరం లేదు. ఈ పచ్చని ప్రకృతి వాతావరణ సమతుల్యతని కాపాడుతుంది. ప్రాణవాయువు ఆక్సిజన్ ని అందిస్తుంది. కరోనా తీవ్ర స్థాయిలో పంజా విసిరినపుడు ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది అసువులు బాసారు. ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభించి మెగాస్టార్ అందరికి ఆదర్శప్రాయమయ్యారు.
మెగాస్టార్ మార్గదర్శకత్వంలో సామజిక సేవాకార్యక్రమాల్ని చేపట్టడం.. మొక్కలు నాటడం మెగాభిమానులకు కొత్తేమి కాదు. ఈసారి ఆగష్టు 9 నుంచి 22 వరకు ఒక్కొక్క అభిమాని తొమ్మిది మొక్కలు చొప్పున నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడాల్సిందిగా కోరుతున్నాం. మెగాస్టార్ జన్మదినం పురస్కరించుకుని అన్ని ప్రాంతాలలో అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటి ఒక రికార్డు నెలకొల్పాలని దృఢ సంకల్పనతో మెగా అభిమానులు ఉండటం గొప్ప విశేషం.
జై చిరంజీవ ! జై జై చిరంజీవ అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.