చిరంజీవి ఏంటి..? రజినీకాంత్ మీద సెటైర్ వేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఆయన మాటలు వింటుంటే.. అలాగే అనిపిస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల సినీ పాత్రికేయుల చరిత్ర పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ఇంకెన్నాళ్లు డ్యాన్సులు చేయాలి.. ఇంకెన్నాళ్లు ఫైట్లు చేయాలి. చాల్లేరా బాబు.. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్లి.. రీ రికార్డింగ్ తో భమ్మని మన హీరోయిజం లేపేస్తే.. హాయిగా వెళ్లామా షూటింగ్ కి.. మేకప్ తుడిచేసుకున్నామా… డబ్బులు ఇచ్చారా.. జేబులో పెట్టుకున్నామా అనుకుంటే.. ఎంత బాగుంటుంది అని అప్పుడు అనిపిస్తుంది కానీ.. అలా చెయ్యలేం కదా.. తనకు ఆ సౌలభ్యం లేదు అన్నారు.
ఇదిలా ఉంటే.. రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’.. ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్. ఈ సినిమాలో హీరోయిజం ఎలివేషన్ సీన్లు అన్నీ అనిరుథ్ రీ రికార్డింగ్ వలన బాగా హైలెట్ అయ్యాయి. అలాగే ఆడియన్స్ కి ఆ సీన్స్ బాగా నచ్చాయని టాక్ కూడా వచ్చింది. అది దృష్టిలో పెట్టుకునే చిరంజీవి ఇలా మాట్లాడారని.. తనకు అలాంటి అవకాశం లేదని.. తన నుంచి డ్యాన్సులు, ఫైట్స్ ప్రేక్షకాభిమానులు ఆశిస్తారని చెప్పారు. అందుకనే నిర్మాతలు, దర్శకులు కూడా తన నుంచి వాటిని కోరుకుంటారని చెప్పారు.
అలా చేస్తేనే నిర్మాతలకు తృప్తి.. దర్శకులకు తృప్తి.. తనకు కూడా తృప్తి అంటూ తన మనసులో మాటలను బయటపెట్టారు మెగాస్టార్. హీరోయిజం గురించి చిరంజీవి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని బట్టి చిరు ఏమాత్రం మారలేదు అనిపిస్తుంది అనే టాక్ వినిపిస్తోంది. తను చేయబోయే సినిమాల్లో తన స్టైల్ ఆఫ్ హీరోయిజం చూస్తారని చెప్పకనే చెప్పారు. మరి.. చిరు ఈసారి ప్రేక్షకుల ఆశించే సినిమాను అందించి బ్లాక్ బస్టర్ అందిస్తారేమో చూడాలి.