హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో మూడు గంటలు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీచేసింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించింది.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించింది. డీఆర్‌ఎఫ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించింది. ఇక రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద వచ్చే అవకాశం ఉన్నది. దీంతో ట్యాంక్‌బండ్‌లో వాటర్ లెవల్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. అదేవిధంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌ను కూడా పర్యవేక్షిస్తూ గేట్లు ఎత్తివేయాలని ఆదేశాలు జారీచేసింది. మూసీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈమేరకు ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 7 జిల్లాలకు రెడ్ హెచ్చరికలు, 17 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, 9 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాల్లో కలెక్టర్ తో పాటు అధికారులందరూ స్థానికంగా ఉండి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు.