రేషన్ కార్డుదారులకు రాగులు, గోధుమ పిండి పంపిణీకి చిత్తూరు జిల్లా పుంగనూరు నుండి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు లబ్దిదారులకు రేషన్ కార్డుదారులకు మూడు కిలోల రాగులు, కిలో గోధుమపిండి పంపిణీ చేశారు. దీనితో పాటుగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని కూడా మంత్రులు ప్రారంభించారు.
పుంగనూరు మున్సిపాలిటీకి చెత్త సేకరణ కోసం ఇటీవల ప్రభుత్వం అందించిన 15 ఈ ఆటోలను మంత్రులు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, చిత్తూరు ఎంపి ఎన్ రెడ్డప్ప, పౌరసరఫరాల శాఖ ఎండి వీరపాండ్యన్ కలెక్టర్ షాన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
చిరుధాన్యాలను ప్రోత్సహించేలా రాయలసీమలో పైలెట్ ప్రాజెక్టు కింద జొన్నలు, రాగులు అందిస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు వెల్లడించారు. చిరుధాన్యాల కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామని… రైతుల నుంచి నాణ్యమైన ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు.