Mind Your Sleep :
“కునుకు పడితే మనసు కాస్త
కుదుట పడతది;
కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది”
అని మూగమనసుల్లో ఆత్రేయ ఎప్పుడో సూత్రీకరించాడు.
కునుకు పడక లోకం అల్లకల్లోలమైపోతూ ఉంటుంది. రోజంతా టెన్షన్ టెన్షన్ గా గడిపి, భయాందోళనల మధ్య పడుకుంటే నిద్ర పట్టదు. కనురెప్ప వేయగానే స్విచ్ ఆన్ చేసినట్లు నిద్ర పట్టాలంటే యోగం ఉండాలి. మనుషులకయితే ఏడెనిమిది గంటల నిద్ర తప్పనిసరి. జీర్ణ క్రియకు, ఆరోగ్యానికి, శరీరం శక్తిని కూడగట్టుకోవడానికి, ఉదయం ఫ్రెష్ గా ఉండడానికి, చురుకుగా పనులు చేసుకోవడానికి కంటి నిండా తగినంత నిద్ర అవసరం.
మెదడులో నానా ఆలోచనల చెత్తను మంచి నిద్ర శుభ్రం చేస్తుందట. ఆదమరచి నిద్రపోతే కలలు రావాలి. కనీసం డిస్టర్బ్ కాని నిద్ర పడితే మెదడులో చెత్త ఆటోమేటిగ్గా శుభ్రమవుతుందని ఆరేళ్ల పాటు క్యాలిఫోర్నియాలో చేసిన ఒక అధ్యయనంలో తేలింది.
అనేక మంది మతిమరుపు రోగుల మెదడు పనితీరు – వారు బాగున్నప్పటి నిద్ర సమయాలను గమనిస్తే- నిద్ర కరువయిన వారే ఎక్కువగా మతిమరుపు బారిన పడ్డట్టు తేలింది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల వారి మెదళ్లలో బీటా అమిలాయిడ్ అనే వ్యర్థ పదార్థం పేరుకుపోయి…అది మతిమరుపుకు దారి తీస్తోందని రుజువయ్యింది.
నిద్ర ఎక్కువయినవారి మెదడులో అంతా త్రిబులెక్స్ సంస్కారవంతమయిన సబ్బుతో కడిగినట్లు మొత్తం వాష్ అవుట్ అవుతుందో? లేదో? అన్నది ఈ అధ్యయనం పరిధిలోకి రాదు.
వేదాంత పరిభాషలో జాగృదావస్థ మేల్కొని ఉండడం. స్వప్నావస్థ కలలు కనడం. సుషుప్త్యవస్థ అంటే గాఢ నిద్ర. ఈ మూడు అవస్థలుకాక మూర్ఛ, మరణం అని మరో రెండు అవస్థలు కూడా ఉన్నాయి కానీ- మూర్ఛ, మరణాలు అమంగళం కాబట్టి వాటిని మనం గుర్తించలేదు. మన గుర్తింపుతో వాటికి నిమిత్తం లేదు. అవి మాత్రం మనల్ను గుర్తిస్తాయి.
కొందరు కళ్లు తెరిచి పడుకోగలరు – వీరిది జాగృత్ నిద్ర.
కొందరు కళ్లు మూసుకుని మేల్కొగలరు – వీరిది నిద్రా జాగృదవస్థ.
కొందరు పగలే మేల్కొని కలలు కనగలరు – వీరిది జాగృత్ స్వప్నావస్థ.
కొందరు కలలోనే మేల్కోగలరు – వీరిది సుషుప్తి జాగృదావస్థ.
కొందరు మానసికంగా ఎన్నో సార్లు మూర్ఛపోతూ మూర్ఛ అనగానేమి? అది ఎటులుండును? అని అమాయకంగా అడుగుతూ ఉంటారు. అయిదోది అయిన మరణం ఎంత అవస్థో చెప్పక్కర్లేదు.
పగలు చూస్తే రాత్రి కలలోకి వచ్చి భయపెట్టేవారు కొందరు. కలలు ఎక్కడొస్తాయో అని కళ్లల్లో ఒత్తులేసుకుని రాత్రంతా మేలుకొనేవారు కొందరు.
మతి ఉన్నా ఉపయోగించనివారు కొందరు.
మతి ఉన్నా మతి లేనట్లు ఉండిపోవాల్సినవారు కొందరు.
మతి లేకపోయినా మతి ఉన్నట్లు భ్రమ కలిగించేవారు కొందరు.
మతి ఉండడం ఇష్టమే లేనివారు కొందరు.
మతిమాలిన లోకంలో మతి ఎందుకు? అని మతిని స్వచ్చందంగా తీసి పక్కన పెట్టుకున్నవారు కొందరు. వీరందరి మధ్య నిద్రలేక మతిని మరచినవారు ఎందరో?
-పమిడికాల్వ మధుసూదన్
Must Read : మంచింగ్ మాఫియా