Saturday, January 18, 2025
HomeTrending Newsరిజర్వాయర్లు అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు

రిజర్వాయర్లు అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు

సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో  పొరుగు రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) ఏ స్టాండ్ తీసుకుందో, ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ కూడా అదే స్టాండ్ తీసుకుందని, దీనిద్వారా చంద్రబాబు నాయుడుది ఎప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతమేనని మరోసారి రుజువు అయిందని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు.  ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య నిత్యం గొడవలు పెడుతూ, చిచ్చుపెట్టి తన పబ్బం గడుపుకోవడమే చంద్రబాబు పని అని ఆయన దుయ్యబట్టారు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ళ సిద్ధాంతం అవలంభించిన చంద్రబాబు.. ఇప్పుడేమో ఆంధ్రాలోనే ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మంత్రి అనిల్‌ ధ్వజమెత్తారు.

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్పూర్తితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్ని ప్రాంతాలు బాగుండాలని చిత్తశుద్ధితో పని చేస్తుంటే..  ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు మాత్రం రాయలసీమ లిప్ట్‌ ఇరిగేషన్‌ పనులు ఆపాలంటూ ప్రకాశం జిల్లా శాసనసభ్యుల చేత లేఖ రాయించడం ద్వారా ఆయన నీచమైన గుణం మరోసారి బయటపడిందన్నారు. ఓటుకు కోట్లు కేసు తర్వాతే..  ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రారంభించి, పూర్తి చేసిందని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలన్నీ ఒక్కటై.. మన ప్రాజెక్టుల గురించి విమర్శలు చేస్తుంటే, చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రం తెలంగాణవాదాన్ని వినిపిస్తూ, మన ప్రాజెక్టులను అడ్డుకునే విధంగా లేఖలు రాయడం విడ్డూరమన్నారు. దీనిద్వారా టీడీపీ ఇప్పుడు తెలంగాణ దేశం పార్టీగా మారిందని విమర్శించారు.

చంద్రబాబు హయాంలోనే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను కట్టిందని అనిల్‌ కుమార్‌ గుర్తుచేశారు. తన అనుకూల మీడియా, టీవీ ఛానల్స్‌ ద్వారా ఇష్టమొచ్చిన రాతలు రాయిస్తున్న చంద్రబాబుకు ఇప్పటికైనా ధైర్యం ఉంటే.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తన వైఖరి బయటపెట్టాలన్నారు. రాష్ట్రంలో నాలుగు దెయ్యాలు ఉన్నాయని.. డీ1- చంద్రబాబు నాయుడు, డీ2- రామోజీరావు, డీ3- రాధాకృష్ణ,  డీ4- బీఆర్ నాయుడు అని విమర్శించారు. ఇవి రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాయని ధ్వజమెత్తారు.

తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. చంద్రబాబు తన అయిదేళ్ల పాలనలో ప్రకాశం జిల్లాకు ఏం చేశారో చెప్పాలని, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై టీడీపీ స్టాండ్‌ ఏంటో చెప్పాలని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన సొంత చిత్తూరు జిల్లాలో మూడు రిజర్వాయర్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు తన వర్గం వ్యక్తులతో నేషనల్‌ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేయించిన ద్రోహి చంద్రబాబు అని మంత్రి అనిల్ మండిపడ్డారు.

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు ఆపేయాలంటూ… ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాయడం బాధాకరమన్న అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు నీచమైన గుణం మరోసారి బయటపడిందని, జిల్లాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సంబంధించి రాజశేఖర్‌ రెడ్డిగారు ఏం చేశారు. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు అన్నది ప్రజలకు తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో చెప్పగలరా..? వైయస్సార్‌ సీఎం అయిన తర్వాతే రూ.4వేల కోట్లతో సాగర్ కాలువలను ఆధునీకరిస్తూ పనులు టేకప్‌ చేయడం జరిగింది. రాజశేఖర్‌ రెడ్డిగారు వచ్చిన తర్వాతే వెలిగొండ ప్రాజెక్ట్‌ పనులు ముందుకు నడిచాయి. అలాగే ప్రకాశం జిల్లాకు వరప్రదాయిని అయిన గుండ్లకమ్మ ప్రాజెక్టుతో పాటు రామతీర్థం ప్రాజెక్ట్‌ను వైయస్సార్‌ ప్రారంభించి పూర్తి చేశారు. కొరిశెపాడు లిఫ్ట్‌, సోమశిల నుంచి రాళ్లపాడుకు సామర్థ్యం పెంచడం కూడా వైయస్సార్‌ గారి హయాంలోనే జరిగిందని మంత్రి గుర్తు చేశారు.

మరి, చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతానికి ఏం చేశారని అడుగుతున్నాం. ఈ రోజు వెలిగొండ తీసుకున్నా.. 2008 నుంచి 2014 వరకూ అప్పట్లో వైయస్సార్‌ కానీ, ఆయన తీసుకువచ్చిన ప్రభుత్వం పదకొండున్నర కిలోమీటర్లు పూర్తి చేస్తే చంద్రబాబు తన అయిదేళ్ల కాలంలో పూర్తి చేసింది కేవలం నాలుగు కిలోమీటర్లే. అదే జగన్‌ మోహన్‌ రెడ్డి గారి  ప్రభుత్వం వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలోనే యుద్ధ ప్రాతిపాదికన మొదటి టన్నెల్ ను 2.8 కిలోమీటర్లు పూర్తి చేసింది. రెండో టన్నెల్ కు సంబంధించి గత  అయిదేళ్లలో టీడీపీ సర్కార్‌ దృష్టి సారించి ఉంటే అప్పుడే పూర్తయేది.

చంద్రబాబు ప్రకాశం జిల్లాకు ఏం చేశారో చెప్పగలరా? ఈ రాష్ట్రాన్ని వదిలి హైదరాబాద్‌లో దాక్కుని, తెలుగుదేశం పార్టీని తెలంగాణ దేశం పార్టీగా మార్చుకున్నారని మంత్రి అనిల్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో  అన్ని పార్టీలు ఒకటై పని చేస్తుంటే… ఇది అన్యాయం, అక్రమం అని ఒక్క మాట కూడా మాట్లాడని ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ ఉండటం రాష్ట్రం దౌర్భాగ్యమన్నారు.

రాయలసీమకు సంబంధించి కానీ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాకు సంబంధించి, అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కావచ్చు.. ఇలా అన్ని ప్రాంతాలు బాగుండాలని జగన్ ఆలోచన చేస్తుంటే..అన్ని ప్రాంతాల మధ్య  చిచ్చుపెట్టే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నారని మంత్రి అనిల్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాటలే… ఇప్పుడు టీడీపీ శాసనసభ్యుల నోటి నుంచి వస్తున్నాయి. ఇవన్నీ వాస్తవం కాదా? ఇవాళ తెలుగుదేశం పార్టీ .. తెలంగాణ దేశం పార్టీగా మారిపోయింది. ఇన్ని మాట్లాడుతున్న చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలని అనిల్ డిమాండ్ చేశారు.

గత అయిదేళ్లలో తెలంగాణ ప్రాజెక్టులు చూస్తే.. 2015లో పాలమూరు-రంగారెడ్డి, డిండి,  2017లో తుమ్మెళ్ల ప్రాజెక్టులకు అం​కురార్పణ జరిగాయి. ఈ ప్రాజెక్టులు అన్నీ చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు వ్యవహారం తర్వాతే ప్రారంభించి, పూర్తి చేశారు.  తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులు మీ హయాంలో జరిగినవి కావా అని మంత్రి చంద్రబాబులు ప్రశ్నించారు.

చంద్రబాబు ఇంకా ఎంత నీచానికి దిగజారారంటే చిత్తూరు గురించి చెప్పుకోవాలన్న మంత్రి అనిల్ ఎలాంటి రిజర్వాయర్‌ లేనటువంటి డ్రాట్‌గా ఉన్న జిల్లా చిత్తూరు. ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మీరు పుట్టిన జిల్లా, మీకు రాజకీయ భిక్ష పెట్టిన చిత్తూరు జిల్లాలో రిజర్వాయర్లు కట్టేందుకు యత్నిస్తే… మీ వర్గం వాళ్లతో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసులు వేయించిన దుర్మార్గమైన, నీచమైన వ్యక్తి చంద్రబాబు. మీరు చేయలేని మంచి పని జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్నారు కాబట్టే మనసు ఒప్పక ఎన్జీటీలో కేసు వేయించారా.. కాదా? రెండు, మూడు చానల్స్‌ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై ఇష్టానుసారం చెత్త రాతలు రాయిస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

అనిల్ కుమార్ యాదవ్ ఇంకా ఏం మాట్లాడారంటే….

రాయలసీమ ప్రాంతం నష్టపోతుంది అని ఆరోజు చంద్రబాబు ఆలోచన చేసి ఉంటే ఇవాళ ఈ ప్రాంతం ఇబ్బందులు పడే అవకాశం ఉండేది కాదు. ఒకప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకువెళుతూ ఉంటే దేవినేని ఉమాను తీసుకు వచ్చి ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ధర్నా చేయించింది మీరు కాదా..? ఇలా ఎప్పుడుకప్పుడు ప్రాంతాల మధ్చ చిచ్చు పెడుతున్నారే తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. అదే తెలంగాణలో ఒక అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాటపై కట్టుబడి వస్తే… ఇక్కడ మాత్రం మీ అనుకూల మీడియాలో వెధవ రాజకీయాలు చేయిస్తుండటం వాస్తవం కాదా అని అడుగుతున్నాం. మీ అనుకూల చానల్స్‌లో

తెలంగాణ వాదాన్ని నెత్తికెత్తుకుని, టీడీపీ అంటే.. తెలంగాణ దేశం పార్టీగా మారింది వాస్తవం కాదా? ఈరోజు టీఆర్‌ఎస్‌ స్టాండే టీడీపీ స్టాండ్‌గా మారింది.

ఎన్నికలకు ముందు చంద్రబాబు తూతూమంత్రంగా ప్రారంభించిన గుంటూరు ఛానెల్‌ను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పరుచూరు వరకూ పెంచి పనులు చేస్తున్నాం. అసంపూర్తిగా వదిలేసిన పల్నాడ్‌ ఛానెల్‌ను పూర్తి చేసి లక్ష ఎకరాల ఆయుకట్టుకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా0. సోమశిల నుంచి రాళ్లపాడుకు ఎక్కువ నీటిని తెచ్చి ఆ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు సస్యశ్యామలం చేయాలనుకుంటున్నారు. దీనివల్ల ప్రకాశం జిల్లా బాగుపడుతుందనేది వాస్తవం కాదా? ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్న జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి, ప్రభుత్వానికి అండగా ఉండాల్సింది పోయి, ప్రాంతాల మధ్య  చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తారా?.

వైయస్సార్‌ గారి కుటుంబం ఏ పని చేసినా అందరూ బాగుండాలని, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచన చేస్తోంది. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏం చేశామనేది చెప్పుకోవడానికి ఏమీ లేదు. 2004లో రాజశేఖర్‌రెడ్డిగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ప్రాంతంలో అయినా తనదైన మార్క్‌ వేసుకుంటూ ముందుకు వెళ్లారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పని చేశారు. వైయస్సార్‌ గారు ఒక్కడుగు వేస్తే… రెండడుగులు వేస్తూ ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారు. తన తండ్రిలాగే అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారు

లేటరైట్‌ కాదు బాక్సైట్‌ అంటూ గత రెండు వారాలుగా ఒక వర్గం మీడియా పని కట్టుకుని ప్రచారం చేసింది.  ఇప్పుడు బాక్సైట్‌ కాదు, లేటరైట్‌ అని ఒప్పుకున్నందుకు ఈనాడుకు ధన్యవాదాలు. ఈ విషయాన్ని 2020లోనే జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది.  అసలు లేటరైట్‌ గనులకు సంబంధించి మా ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదన్న నిజాన్ని ఒప్పుకోవడానికి అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ ముగ్గురికీ మనసు రావడం లేదు. లేటరైట్‌ అనేది సిమెంట్‌ పరిశ్రమలో ఉపయోగపడుతుంది. అయితే మొత్తంగా సిమెంట్‌ పరిశ్రమలో అది సున్నపురాయి మాదిరిగా భారీగా ఉపయోగపడేది కాదు. చాలా కొది మోతాదుల్లో మాత్రమే లేటరైట్‌ను ఏ సిమెంట్‌ కంపెనీ అయినా వాడుతుంది.  సిమెంట్‌ కంపెనీలు నల్లగొండలో ఉన్నా, కడపలో ఉన్నా, ఎవరివైనా, ఎక్కడి నుంచైనా లేటరైట్‌ను కొనుక్కుంటారు.  బాక్పైట్‌ను కానీ, అల్యూమినియమ్‌ ముడి పదార్థాలు కానీ ఏ సిమెంట్‌ పరిశ్రమలోనూ వాడరు. మైనింగ్‌ లీజ్‌లు కేవలం హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంతే తప్ప కొత్త ప్రభుత్వం ఏ ఒక్కరికి మైనింగ్‌ లీజ్‌లు ఇవ్వలేదు.

2014, నవంబరు 15న, అంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం భమిడిక భూముల్లో లేటరైట్‌ మైనింగ్‌కు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చింది.  సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వం 2014, డిసెంబరు 4న ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ద్వారా మైనింగ్‌కు అవసరమైన సరంజామా పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చింది. విశాఖ జిల్లాలో భమిడిక ప్రాంతంలోనే ఆరు లీజ్‌లు ఉండగా, అందులో ఇక లీజ్‌కు మాత్రమే 2018, ఆగస్టు 18న హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంటే చంద్రబాబు హయాంలోనే హైకోర్టు ద్వారా తీర్పు వెలువడింది.

మరి చంద్రబాబు ప్రభుత్వం ఆ తీర్పు అమలు కాకుండా ఎందుకు అడ్డుకోలేదో టీడీపీయే సమాధానం చెప్పాలి.  నిజానికి ఆ ప్రాంతం నుంచి లేటరైట్‌ కొల్లగొట్టిన చరిత్ర మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి, ఆయన కొడుకు విజయ్‌కు మాత్రమే ఉంది.  గిరిజనులు పేరిట మూడు మైనింగ్‌ లీజ్‌లు తీసుకుని అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్, అయ్యన్నపాత్రుడు కలిసి చేసిన దోపిడి మీదే ఇప్పుడు విచారణ జరగాలి.

అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి ఈవిధంగా నీచ, హేయమైన పనులు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా? ఇవాళ  రాష్ట్రానికి  నాలుగు దెయ్యాలు తయారయ్యారు.. డీ1 చంద్రబాబు నాయుడు, డీ2 రామోజీరావు, డీ3 రాధాకృష్ణ, డీ4 బీవీ నాయుడు.. మా వాళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకపోతే అడ్డమైన రాతలు రాస్తాం. అడ్డమైన చేష్టలు చేస్తాం, అది మా హక్కు అనేలా వీళ్ళు వ్యవహరిస్తున్నారు.

చివరిగా.. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఆగస్ట్‌ చివరికల్లా పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసిత కుటుంబాలకు ప్యాకేజీలు అందచేస్తాం. ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సోము వీర్రాజుగారు కేంద్రం నుంచి త్వరగా నిధులు వచ్చేలా సహకరిస్తే మేము సంతోషిస్తాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్