నీటి పంపకాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. నీటి పంపకాల అంశంపై తమ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉందని, చేతులు ముడుచుకుని కూర్చోలేదని వ్యాఖ్యానించారు. నీటి వివాదాల విషయంలో తాము మౌనంగా లేమని, తమ వ్యూహాలు తమకు ఉన్నాయని చెప్పారు.
రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణా మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిలా తాము అసభ్య పదజాలం ఉపయోగించలేమని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విభజన చట్టానికి లోబడే తమ నీటి వాటాను వాడుకుంటున్నామని వెల్లడించారు. ఫెడరల్ వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికుంటాయని, చట్ట పరిధి దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయని వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలనకు వస్తున్న కృష్ణ రివర్ మేనేజెమెంట్ బోర్డు అధికారులకు పూర్తిగా సహరిస్తామని బొత్స చెప్పారు, కరోనా రెండోదశ ఉధృతంగా ఉన్నందునే వారిని కొంతకాలం ఆగాలని కోరాము తప్ప వారిని అడ్డుకున్నామన్న వార్తలు సరికాదన్నారు.