రాష్ట్ర ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్ళారని, దీనిపై కూడా తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. టిడిపి, ఎల్లో మీడియా కావాలనే బురద జల్లుతున్నారని, ఆ పార్టీకి నీచమైన ఆలోచనలు తప్ప ప్రభుత్వానికి మంచి సూచనలు ఇచ్చే అలవాటు లేదని దుయ్యబట్టారు.
అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని తెలుగుదేశం మాట్లాడడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శమన్నారు. ప్రతిపక్షాల మైండ్ సెట్ మారడం లేదని బొత్స వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ పనులు, నిధుల కోసం సిఎం జగన్ పలువురు కేంద్ర మంత్రులతో చర్చిస్తారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుపై జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కూడా కలుస్తారని బొత్స వివరించారు. కరోనా కట్టడికి సమర్ధవంతమైన చర్యలు తీసుకున్నామని, సంక్షోభ సమయంలోను సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని బొత్స వివరించారు.
మరోవైపు, సిఎం జగన్ రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఎంపిలు విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకట రమణ స్వాగతం పలికారు. జగన్ వెంట ఎంపిలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలు ఢిల్లీ వెళ్ళారు.