తెలంగాణ రాష్ట్రం వచ్చాక సినిమా రంగంలో తెలంగాణ వాళ్ల ప్రాధాన్యం పెరిగిందని, తెలంగాణ నుంచి అనేకమంది కళాకారులు దర్శకులు నిర్మాతలు ముందుకు వస్తూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప గొప్ప సినిమాలు నిర్మిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విసునూరు గ్రామంలో గువేరా ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సినిమా పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సినిమా షూటింగ్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సినిమా రంగంలో ఒకప్పుడు తెలంగాణ పాత్ర తక్కువగా ఉండేదని, తెలంగాణ వాళ్లు పరిమిత సంఖ్యలో పనిచేసేవారని చెప్పారు. కానీ తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ గారి ప్రోత్సాహంతో అనేకమంది కళాకారులు రచయితలు దర్శకులు నిర్మాతలు వివిధ విభాగాల వారీగా విస్తృతంగా పనిచేస్తున్నారని, వాళ్లంతా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పలు సినిమాలు నిర్మిస్తూ మంచి పేరు గడిస్తున్నారని మంత్రి తెలిపారు. అలాగే గువేరా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం కూడా గొప్ప విజయాన్ని సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ నేపథ్యంలో మంచి ఫ్యామిలీ కామెడీ వినోదాత్మకంగా వస్తున్న ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకున్నారు.
ఆ సినిమా దర్శకుడు ఎస్ ఎస్ వర్మ, నిర్మాత శ్వేత అమర్ వాది, హీరో హీరోయిన్ లు డాక్టర్ విశ్వాస్, దివ్య దత్తాత్రేయ, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, కెమెరా పవన్ గుంటుకు, పాటల రచయితలు గోరటి వెంకన్న, పూర్ణా చారి, శ్రీనివాస మౌళి, మనోహర్, నటీనటువర్గం సాంకేతిక నిపుణులు, తదితరులకు మంత్రి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఆ గ్రామ పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.