Saturday, January 18, 2025
HomeTrending Newsభారీ పెట్టుబడులే లక్ష్యం: అమర్ నాథ్

భారీ పెట్టుబడులే లక్ష్యం: అమర్ నాథ్

ప్రజలకు హానిచేయని పరిశ్రమల ఏర్పాటుకే ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమని, ఏ అవకాశాన్నిరాష్ట్రం వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనరంగంలో రూ.32 వేల  కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం కాలుష్యంలేని పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తుందని, మంచి ఎక్కడున్నా తీసుకుంటామని తెలిపారు. రవాణా అనుసంధానం, పుష్కలంగా సహజ వనరులు, నైపుణ్యం కలిగిన యువతీయువకులు, అపారంగా మౌలిక వసతులు ఏపీలో ఉన్నాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ వాహన రంగ వ్యవస్థ ఏర్పాటు కోసం డబ్ల్యూఈఎఫ్ భాగస్వామ్యంతో ఏపీ నిర్వహిస్తున్న తొలి వర్చువల్ సదస్సులో మంత్రి గుడివాడ అమర్ నాథ్, అధికారులతో కలిసి పాల్గొన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో భాగస్వామ్యమైన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు స్నేహపూర్వక వాతావరణానికి ఏపీ చిరునామాగా ఉందని,  గత దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి సమక్షంలో డబ్ల్యూఈఎఫ్ తో ఏపీ ఎంవోయూ చేసుకుందని వివరించారు.  ఆ తర్వాత ఇలా తొలిసారి వర్చువల్ గా సమావేశమవడం మంచి పరిణామమని అభివర్ణించారు.  ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ సర్వే ప్రకారం, 2025 కల్లా భారత్ ఎలక్ట్రిక్ వెహికిల్ రంగంలో రూ. 50వేల కోట్ల (7.09 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు ఆకర్షిస్తుందని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్