రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధి రేటు 2022-23ఆర్ధిక సంవత్సరంలో 13.18 శాతంగా నమోదైందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. జాతీయ స్థాయిలో ఈ రేటు 11.2 శాతం అని పేర్కొన్నారు. వ్యవసాయ వృద్ధి రేటును కేవలం వ్యవసాయానికే పరిమితం చేయకుండా, ఉద్యానవన, మత్స్య రంగాలను కూడా కలిపి అంచనా వేస్తారని మంత్రి వివరించారు. కానీ టిడిపి నేతలు దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా వ్యవసాయం సంక్షోభంలో పడిందని చెప్పడం సరికాదన్నారు. నెల్లూరులో మంత్రి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయంపై ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ఖండించారు. గత టిడిపి హయంలో పంట విస్తీర్ణం, ఉత్పత్తి గురించి ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. బాబు హయంలో సరాసరి 153 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయని, తమ హయంలో ఈ నాలుగేళ్ళలో సగటున 166 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయ్యిందని విశ్లేషించారు. వాస్తవాలు మరుగుపరచడం టిడిపి నేతలకు, మీడియాకు సరికాదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయం లాభసాటిగా మారిందన్నారు.
చంద్రబాబు నిన్న నెల్లూరు మీటింగ్ కు వచ్చింది తమను తిట్టడానికేనని మంత్రి ఎద్దేవా చేశారు. అయన సెల్ఫీ తీసుకోవాల్సింది టిడ్కో ఇళ్ళ దగ్గర కాదని, ప్రతి ఇంటికీ వచ్చి ఆయా ఇళ్లలోని మహిళలు ఏం మాట్లాడుతున్నారో… వారి పాలనలో ఏం జరిగిందో, తమ హయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని సవాల్ విసిరారు. నిన్న సంగం- నెల్లూరు బ్యారేజ్ దగ్గర కూడా సెల్ఫీ తీసుకోవాల్సి ఉందని అన్నారు. బాబు ఎన్ని హామీలు ఇచ్చి వాటిలో ఎన్ని అమలు చేశారో, సిఎం జగన్ ఎన్ని హామీలిచ్చి ఎన్ని పూర్తి చేశారో.. ఆ విషయంపై చర్చకు రావాలని బాబును కాకాణి డిమాండ్ చేశారు. మూడు గంటల పాటు ఏసీ రూముల్లో సమీక్ష చేసుకొని వెళ్లిపోయారని.. అలాంటి బాబు మనవ సంబంధాలు, మట్టి గడ్డలు అంటూ మాట్లాడుతున్నారని కాకాణి మండిపడ్డారు. గతంలో సోమిరెడ్డి మిల్లర్ల దగ్గర లంచాలు తీసుకొని రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు.