Saturday, November 23, 2024
HomeTrending Newsదళితబందు సభకు ఏర్పాట్లు

దళితబందు సభకు ఏర్పాట్లు

మహత్తరమైన దళితబంధు పథకాన్ని ప్రారంభించే సందర్భంగా ఈ నెల 16న పట్టణ శివారులోని శాలపల్లిలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాల్సిందిగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలను కోరారు. ఈ చారిత్రాత్మకమైన సభకు లక్షా 20 వేల మంది హాజరవుతారని, ఇందులో ఎక్కువ సంఖ్యలో దళితులే ఉంటారన్నారు. సభ జరిగే మైదానాన్ని మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లు పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష చేశారు. సభను విజయవంతం చేసేందుకు గాను చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవలసిన జాగ్రత్తలు, అవసరమైన చర్యల గురించి జిల్లా యంత్రాంగానికి పలు సూచనలు చేశారు, సలహాలిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల విలేకరులతో మాట్లాడుతూ,దేశ చరిత్రలోనే గొప్ప పథకాన్ని ప్రారంభించేందుకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఘన స్వాగతం చెప్పేందుకు, సభను దిగ్విజయం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.సభకు 825బస్సుల్లో దళితులు తరలివస్తారు.. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, సభ దిగ్విజయం అయ్యేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, మంచినీళ్లతో పాటు భోజన సౌకర్యం కల్పిస్తున్నామని, ఎండ, వానను దృష్టిలో ఉంచుకుని టెంట్లు పకడ్బంధీగా వేస్తున్నామని తెలిపారు. సభకు దళిత వర్గానికి చెందిన ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా హాజరవుతారని మంత్రి చెప్పారు.
ఈ సభలో 2వేల కుటుంబాలకు 10లక్షల చొప్పున చెక్కులు అందజేస్తామని, ఆ తెల్లారి నుంచి నియోజకవర్గంలోని 20వేల కుటుంబాలకు అందిస్తామని కొప్పుల వివరించారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి 2వేల కోట్లు ప్రకటించారని, 500 కోట్ల విడుదల చేయడం జరిగిందన్నారు.
ఈ పథకాన్ని ఒక ఉద్యమం మాదిరిగా రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని, ఇందుకు సంబంధించి సర్వే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది 119 నియోజకవర్గాలలో 100 కుటుంబాల చొప్పున సుమారు 12వేల కుటుంబాలకు,అటు తర్వాత అందరికి అందజేస్తామన్నారు. రాష్ట్ర జనాభాలో సుమారు 20%మంది దళితులు ఉండగా, ఇందులో భూమి ఉన్నోళ్లు చాలా తక్కువగా ఉంటారని, అది కూడా కొన్ని గుంటల భూమి గలవారేనని.. ఉద్యోగులకు తప్ప దాదాపు అన్ని కుటుంబాలకు అందించడం జరుగుతుందని మంత్రి ఈశ్వర్ చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్