పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో రూ.650 కోట్లతో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌లో ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దఅంబర్‌పేట్ అర్బన్ ఫారెస్ట్ లో మొక్కలు నాటి మంత్రులు ఐకేరెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో కలిసి పార్కు ప్రారంభించారు. మానవాళికి అత్యవసరమైన ప్రాణవాయువును అందించడంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులు కీలకంగా మారుతాయన్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన వెంట ఉండేది చెట్టు మాత్రమేనని, పచ్చదనం పెరిగేలా చట్టాల్లో సీఎం కేసీఆర్ కఠినమైన నిబంధనలు పెట్టారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
హరితహారం మన పిల్లలు, భవిష్యత్ తరాల కోసం అన్న సోయి అందరికీ రావాలన్న మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి చేరుకోవాలన్న సీఎం కేసీఆర్ కల నెరవేరే దిశగా కృషి చేద్దామన్నారు.