Sunday, January 19, 2025
HomeTrending Newsవర్క్ ఫ్రం హోం టౌన్ సెంటర్లు ప్రారంభం

వర్క్ ఫ్రం హోం టౌన్ సెంటర్లు ప్రారంభం

Minister Mekapati Launched Wfht Centers 

వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్ల వెబ్ సైట్ ను రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. నిర్ణీత కాల వ్యవధిలో ఈ పైలట్ ప్రాజెక్టును పూర్తి చేసిన ఐ.టీ శాఖ, ఏపీఎస్ఎస్డీసీ, ఏపీఎన్ఆర్టీ, ఏపీఐఎస్, ఏపీఎస్సీహెచ్ఈ విభాగాలను ఆయన అభినందించారు. సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఉద్యోగులకు ఎంతగానో ఉపశమనం కలిగించే డబ్ల్యూఎఫ్ హెచ్ టి (WFHT) అధికారిక వెబ్ సైట్ ను విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు.

కోవిడ్ పరిస్థితులలో స్వగ్రామాలకు చేరిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇంటర్నెట్ అంతరాయం, కొన్ని చోట్ల ఆఫీస్ వాతావరణం లేక ఇబ్బందిపడుతున్నారని, అలాంటివారికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నో కంపెనీలు ఉద్యోగుల ఖర్చుతగ్గించుకునే ప్రయత్నంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కే మొగ్గుచూపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్లు సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మారుమూల ప్రాంతాలలోనూ ఈ వ్యవస్థను తీసుకువచ్చేందుకు ఈ పైలట్ ప్రాజెక్ట్ కు స్పందనతో అంచనా వేసుకుంటామన్నారు.

ప్రస్తుతానికి విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్దనగరాలలో ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.5 వేలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఏపీలోని మిగతా పట్టణాల్లో కేవలం రూ.4వేలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఈ అమౌంట్ కొన్ని కార్పొరేట్ సంస్థలు వసూలు చేసే మొత్తంలో 25 శాతం మాత్రమేనన్నారు.  ల్యాప్ టాప్ తెచ్చుకుని హాయిగా పని చేసుకునే వీలుగా ప్రతి డబ్ల్యూఎఫ్ హెచ్ టీ లో సకల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 29 చోట్ల ఇంజనీరింగ్ కాలేజీలు, విశాఖ, కాకినాడ, తిరుపతి ప్రాంతాలలో ఏపీఎస్ సెంటర్లలో 30 మంది కూర్చుని పని చేసుకునే వీలుగా ఈ వర్క్ ప్రమ్ హెమ్ టౌన్లను తీర్చిదిద్దామని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. కంపెనీలు, ఉద్యోగుల నుంచి వచ్చే డిమాండ్ ని బట్టి త్వరలో ఈ సెంటర్లను మరిన్ని మారుమూల ప్రాంతాలకు విస్తరించే అవకాశముందని మంత్రి తెలిపారు భవిష్యత్ లో లక్ష మంది ఉద్యోగులు లక్షణంగా పని చేసుకునే వీలుగా 102 సీఎం ఎక్సలెన్స్ సెంటర్లు, 500 కళాశాలలు, 20 ఇంజనీరింగ్ కాలేజీలు సహా ఏపీఐఎస్, ఏపీఐఐసీ కేంద్రాలను వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ కేంద్రాలుగా మార్చనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్లను వినియోగించుకోవడానికి ఆసక్తి కలిగిన ఐ.టీ , సాఫ్ట్ వేర్ ఉద్యోగులు 99888 53335 నంబర్ కి సంప్రదించవచ్చు. లేదా,   www.apit.ap.gov.in/wfht/ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఈ కార్యక్రమంలో ఐ.టీ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, ఐ.టీ శాఖ సలహాదారులు శ్రీనాథ్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, శేషి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : ప్రఫుల్ పటేల్ తో మేకపాటి భేటీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్