వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మోసంచేసినవారు ఎప్పటికైనా ప్రాయశ్చిత్తం చెల్లించుకోవాల్సిందేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పూర్తిగా చంద్రబాబు ఉచ్చులో పడిపోయారని, అందుకే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నిన్నటిదాకా తమతోనే ఉన్న ఆమె ఈరోజు అక్కడికి వెళ్లి జగన్ గురించి మాట్లాడడం పట్ల విచారం వ్యక్తం చేశారు. సజ్జల నుంచి ప్రాణహాని ఉందంటూ ఆమె మాట్లాడడం చూస్తుంటే ఆమెకు మతిపోయిందా అనే అనుమానం కలుగుతోందని, అసలు నీ గురించి ఆలోచన చేసే సమయం సజ్జలకు లేదని అన్నారు. దళిత మహిళనంటూ చెప్పుకుంటున్న శ్రీదేవి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాపాడుకుంటూ పని చేయాలని హితవు పలికారు. శ్రీదేవి ప్రచార వాహనాన్ని తమ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారన్న ఆరోపణలను మేరుగ ఖండించారు. ఆమె ఆస్తుల జోలికి వెళ్ళాల్సిన అవసరం మాకేమిటని ప్రశ్నించారు. తప్పు చేసింది కాబట్టే భయపడి ఆమె హైదరాబాద్ లో తలదాచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఆమె గురించి మాట్లాడడం సమయం వృథా అని, అసలు ఏమి మాట్లాడుతున్నారో ఆమెకే అర్ధం కావడంలేదన్నారు. వైఎస్ కుటుంబం పేదల పక్షపాత కుటుంబం అని, తమ లాంటి వారిని ఎందరినో గుర్తించి పదవులు ఇచ్చారని మంత్రి చెప్పారు.