Friday, November 22, 2024
Homeతెలంగాణఅక్రమ ప్రాజెక్టులు అపాల్సిందే : వేముల

అక్రమ ప్రాజెక్టులు అపాల్సిందే : వేముల

అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులు వెంటనే ఆపాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  తెలంగాణా రైతుల పొట్ట కొట్టే ప్రయత్నం చేసున్నారని దీన్ని సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.  ఇప్పటికైనా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన  ఆదేశాలు పాటించాలని వేముల సూచించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ నీటిని ఆంధ్రాకు తరలిస్తే అంతకు రెట్టింపు నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న జగన్ మోహన్ రెడ్డిని ఏమనాలని ప్రశ్నించారు. నిన్న చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ రెడ్డి వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేశారు.  ఆంధ్ర ప్రదేశ్ కడుతున్న ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని,  నీటి వివాదాలు పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. ఏపి, కేంద్రం ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

నిన్నతాను చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ ప్రజలపై కాదని, పాలకులను ఉద్దేశించి మాత్రమే చేశానని వివరణ ఇచ్చారు. ఏపి ప్రజలపై వ్యాఖ్యలు చేయడం టిఆర్ఎస్  విధానం కూడా కాదని వెల్లడించారు.అయితే తెలంగాణా ప్రయోజనాలకు విఘాతం కలిగితే సహించబోమని తేల్చి చెప్పారు.

ఒక్క శ్రీశైలం ప్రాజెక్టు నుండే పోతిరెడ్డి పాడు, ముచ్చుమర్రి లిఫ్ట్ ద్వారా రోజుకు 9.12 టిఎంసీల నీటిని తరలించేలా అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల వాటాను త్వరగా తేల్చాలని, దీనికి ఏపి, తెలంగాణ రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు, బండి సంజయ్ లు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్