విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించామని, 17 నెలలుగా వ్యవస్థలు అన్ని అతలాకుతలం అయ్యాయని విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వైద్య శాఖ నివేదిక ప్రకారమే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం చేస్తున్నామన్నారు. 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారని, సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రతీ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని కోరారు. అంగన్ వాడీ స్కూల్స్ కూడా ప్రారబిస్తున్నామన్న సబితా ఇంద్రారెడ్డి డీఈవోలు అందర్ని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
మంగళవారం నాడు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లోనున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యాలయం నుండి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, నగరపాలక సంస్థ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అధ్యక్షులు, ఇతర జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులతో విద్యాసంస్థల పునఃప్రారంభం, విద్యాసంస్థలలో పారిశుద్ధ్య పనులు నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సర్పంచ్, కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్మన్, మేయర్లు అందరూ బాధ్యతగా తీసుకోవాలని, ప్రతిరోజూ పాఠశాలల్లో ఏఏ పనులు చేశారో రాష్ట్ర అధికారులకు నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు. కోవిడ్ పాజిటివ్ వస్తే టెస్టులు చేసి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. కోవిడ్ నిబంధనల ప్రకారమే పాఠశాలల నిర్వహణ ఉంటుందన్న సబితా ఇంద్రారెడ్డి తల్లిదండ్రులు పిల్లల ట్రాన్స్ పోర్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
స్కూల్ బస్ సానిటైజ్ చేయాలని, ఆటోల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పిల్లల ట్రాన్స్ పోర్టు ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. అధికారులు అందరూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ధైర్యం కల్పించాలని, ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, బస్సుల కండీషన్లు చూసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ప్రైవేటు పాఠశాలలు ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులపై ఫీజుల విషయంలో ఒత్తిడి తీసుకురావొద్దని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వ జీవో ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.