కృష్ణా జలాలపై అనవసర వివాదం ఆపాలని ఏపీ ప్రభుత్వానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనుకుంటే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసి అనుమతులు తెచ్చుకున్న తర్వాతే నీళ్లు తీసుకెళ్లాలన్నారు. మహబూబ్‌నగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంలో ఏపీ మంత్రుల వ్యాఖ్యలు విచారకరమన్నారు. తెలంగాణలోని ఏపీ ప్రజల ఆస్తులు, పరిశ్రమలు, ఉద్యోగాలకు ఏమైనా ఇబ్బంది కలిగించామా అని మంత్రి ప్రశ్నించారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకే వ్యతిరేకమని, ఆంధ్రా ప్రజలకు కాదని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
గతంలో ఆంధ్రా నేతలు తెలంగాణ పదాన్ని కూడా అసెంబ్లీలో ఉచ్చరించకుండా చేశారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. వేలమంది తెలంగాణ ప్రజల మరణాలకు నాటి నాయకులు కారణమయ్యారన్నారు. తెలంగాణ వచ్చాక తమ వ్యాపారాలు అడ్డుకుంటున్నారని ఏపీ ప్రజలు ఒక్కరైనా ఫిర్యాదు చేశారా?ఈ ఏడేళ్లలో హైదరాబాద్‌లో ఎవరైనా ఇబ్బంది పడ్డారా? ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు తీసేశామా? ఆంధ్ర నేతల పేర్లతో ఉన్న కాలనీలు, పార్కుల పేర్లు మార్చామా అని ఆయన ప్రశ్నించారు.
కృష్ణా బేసిన్‌ను కాదని పెన్నా నదికి నీటిని తరలించడం మంచిది కాదన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు.. ఈ విషయం కృష్ణా బోర్డుకు తెలియదా అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.