Friday, March 13, 2026
Homeతెలంగాణచేపల ఎగుమతులకు ప్రణాళికలు

చేపల ఎగుమతులకు ప్రణాళికలు

మత్స్యకారులపై దాడులకు పాల్పడినా, మత్స్య సంపదకు నష్టం కలిగించిన అలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఎన్నో సంవత్సరాలుగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మత్స్యకార సంఘాలకు చెందిన ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, MLA ముఠా గోపాల్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా ఇతర మత్స్య శాఖ అధికారులు, పలువురు మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు మత్స్యకార సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో మత్స్యకారులపై దాడులు జరుగుతున్నాయని, మత్స్య సంపదకు నష్టం కలిగిస్తూ తీరని అన్యాయం చేస్తున్నారని మంత్రికి పిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలకు పాల్పడే వారిని ప్రభుత్వం ఉపేక్షించబోదని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి కఠిన చట్టాల అమలుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మత్స్యరంగ పరిరక్షణ కోసం సమగ్ర పాలసీ/చట్టానికి రూపకల్పన చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు గంగపుత్రుల నుండి 5 గురు, ముదిరాజ్ సంఘం నుండి 5 గురు చొప్పున  మొత్తం 10 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

ఈ కమిటీ ముందుగా కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో పర్యటించి అక్కడి మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, సొసైటీల లో ఉన్న సమస్యలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి మత్స్య శాఖ అధికారులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జలవనరులపై మత్స్యకార వృత్తిలో  ఉన్న వారికి మాత్రమే చేపల పెంపకం పై హక్కులు ఉంటాయని, ఇతరులు అజమాయిషీ, హక్కుల కోసం ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి వివాదాలు లేని సొసైటీలలో సభ్యత్వ నమోదు నిర్వహించాలని చెప్పారు.

తక్కువ ధరకు చేపలను విక్రయించుకొని నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు మత్స్యకార సొసైటీ ల నుండి నేరుగా మత్స్య ఫెడరేషన్ ద్వారా చేపలను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మత్స్య సంపదను ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. అన్ని జిల్లాలలో నాన్ వెజ్ మార్కెట్ ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో గంగపుత్ర, ముదిరాజ్ సొసైటీలకు ప్రతినిధులు దీటి మల్లయ్య గంగపుత్ర, ధన్ రాజ్, మోహనకృష్ణ, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular