Saturday, January 18, 2025
HomeTrending Newsకరోన జాగ్రత్తలతో ఈ ఏడాది బోనాలు

కరోన జాగ్రత్తలతో ఈ ఏడాది బోనాలు

తెలంగాణ రాష్ట్ర పండుగ ఆషాడమాసం బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై  ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,  MLC లు ప్రభాకర్, సురభి వాణిదేవి, MLA లు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్, సాయన్న, సుబాష్ రెడ్డి, రాజసింగ్, DGP మహేందర్ రెడ్డి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, సజ్జనార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా బోనాల ఉత్సవాలను నిర్వహించ లేకపోయినట్లు మంత్రి వివరించారు. ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయాల అలంకరణ, పూజల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేస్తుందని, ఏర్పాట్ల కోసం 60 కోట్ల రూపాయల ను కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

బోనాల ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని 3 లక్షల మందికి సరిపడా మాస్క్ లు, శానిటైజర్లను  తాను వ్యక్తిగతంగా అందజేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ప్రతి ఆలయం వద్ద ఖచ్చితంగా శానిటై జర్లను అందుబాటులో ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు.

బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ప్రధాన ఆలయాల వద్ద ప్రత్యేక వైద్య శిభిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఆయా ఆలయాల వద్ద మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ లను ఏర్పాటు చేసి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరుగుతుందని, మొబైల్ టెస్టింగ్ సెంటర్ లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు, వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్