To find out a way: ఉద్యోగుల సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైన మంత్రుల కమిటీ నిన్న రాత్రి ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను ఆయనకు వివరించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి సమావేశమయ్యారు. పిఆర్సి అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు ఈ భేటీ దోహదం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. శనివారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో మంత్రుల బృందం, పిఆర్సి సాధన కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.
గత అర్థరాత్రి వరకూ జరిగిన చర్చలను కొనసాగిస్తూ పిఆర్సి లోని అంశాలపై ఇరు పక్షాలూ ఒక అంగీకారానికి వచ్చేందుకు ప్రయతిస్తున్నాయి. ఈ చర్చల్లో మంత్రుల కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్, పేర్ని వెంకట్రామయ్య (నాని) తోపాటు ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ ఉద్యోగ సంఘాల తరుపున పిఆర్సి సాధన కమిటీ సభ్యులు బండి శ్రీనివాసరావు , కె ఆర్ సూర్యనారాయణ, కె వెంకటరామి రెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.
Also Read : నేటితో పరిష్కారం: బొత్స ఆశాభావం