Sunday, January 19, 2025
HomeTrending Newsమంత్రులకు వాళ్ళ శాఖలేమిటో కూడా తెలియదు: లోకేష్

మంత్రులకు వాళ్ళ శాఖలేమిటో కూడా తెలియదు: లోకేష్

వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో విజయం సాధించాలని వైఎస్సార్సీపీ ప్రయతిస్తోందని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రెండు చోట్ల ఓట్లు రాయించుకున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి దేశంలోనే ఓ చెత్త క్యాబినెట్ అనే పేరు వచ్చిందని ఎద్దేవా చేశారు. మంత్రులకు వారి శాఖలు ఏమిటో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. ఆర్ధిక మంత్రి బుగ్గన పొద్దున లేస్తే అప్పుల కోసం ఢిల్లీలో ఉండే అప్పుల అప్పారావు అని, పెద్దిరెడ్డి గనులు మింగుతున్నారని, నకిలీ మద్యంతో పాటు కోర్టు ఫైళ్లు కొట్టేసిన మంత్రి కాకాణి, పిల్ల కాలువలు కూడా తవ్వలేని మంత్రి అంబటి అని, సొంత వూళ్ళో ధాన్యం బస్తాలు ఇవ్వలేని మంత్రి కారుమూరి అని… పిల్లలు బాగా చదువుకుంటున్నారని అందుకే ఉద్యోగాలు రావడం లేదని విద్యా మంత్రి బొత్స అంటున్నారని, ఐటి మంత్రిని కోడిగుడ్డు మంత్రి అని లోకేష్ అభివర్ణించారు.

రోడ్లపై స్విమ్మింగ్ పూల్ పథకం తీసుకువచ్చారని, ప్రతి పట్టణంలో, నగరంలో రోడ్లపైనే వీటిని నిర్మిస్తున్నారని లోకేష్ చమత్కరించారు. రోడ్లపై నిలిచిన నీళ్ళలో వరి నాట్లు వేయవచ్చని, ఈత కూడా  కొట్టవచ్చని అన్నారు.

చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని, ఒక అన్నగా అండగా నిలిచారని, టిడిపి-జనసేన పార్టీలు కలిసి మరో రెండునెలల్లో వైసీపీని ఇంటికి పంపుతామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. పసుపు జెండా చూస్తూనే అందరికీ ఒక ఉత్సాహం వస్తుందని; వైసీపీ వాళ్లకు మద్యం చూస్తే కిక్ వస్తుందని, కానీ టిడిపి కార్యకర్తలు చంద్రబాబు ఇచ్చిన పిలుపుతోనే కిక్ వస్తుందని చెప్పారు. చట్టాలను ఉల్లంఘించి టిడిపి శ్రేణులను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరినీ తాము అధికారంలోకి రాగానే న్యాయ విచారణ జరిపించి సర్వీసు నుంచి తొలగిస్తామని పునరుద్ఘాటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్