బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం రోడ్లు-భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి నిన్న రాత్రి మంత్రి వేముల నివాసానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు…వేల్పూర్ లోని మంత్రి ఇంట్లో రాత్రి బస చేశారు. ఉదయం స్వయంగా వాహనం నడుపుతూ గ్రామంలో ఇద్దరు మంత్రులు కలియతిరిగి పరిసరాలను పరిశీలించారు. గ్రామంలోని పలువురిని పలకరించారు. తడి పొడి చెత్త పట్ల మహిళలకు అవగాహన కల్పించారు.గ్రామాల్లో చెత్త తరలించే ట్రాలీలు ఏ టైం కి వస్తున్నాయని అడిగారు. తడి పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.
గ్రామంలో పర్యటిస్తుండగా ఓ కిరాణా షాపు ముందు ప్లాస్టిక్ కవర్లు, చెత్త పేరుకుపోయి ఉండడాన్ని గమనించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు షాపు యజమానికి 100 రూ. ఫైన్ విధించారు. ప్రజలకు, షాపుల యజమానులకు అవగాహన కల్పించేందుకే ఈ జరిమానా అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే అని అన్నారు.
అంతకుముందు పల్లె ప్రకృతి వనం,వైకుంఠ దామం పరిశీలించారు.పల్లె ప్రకృతి వనంలో చెట్ల మధ్యలోని ఖాళీ స్థలంలో ఆహ్లాదకరంగా,ఆకర్షణీయంగా ఉండేలా గ్రీన్ గ్రాస్ పెంచాలని ఈ సందర్భంగా సూచించారు. వైకుంఠ దామంలో ప్రస్తుతం ఉన్న వెయిటింగ్ హాల్ మొత్తం కాంక్రీటు స్లాబ్ వేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం,వైకుంఠదామం సదుపాయాలు, నిర్వహణ పట్ల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంతృప్తి వ్యక్తం చేశారు.మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి, రైతు నాయకులు దివంగత వేముల సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన రైతు వేదికను సందర్శించారు. రైతు వేదిక వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం వేముల సురేందర్ రెడ్డి స్మృతి వనం ఘాట్ వద్ద,వేల్పూర్ క్రాస్ రోడ్ లోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి తో ఉన్న అనుబంధాన్ని,కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు ఎర్రబెల్లి దయాకరరావు గుర్తు చేసుకున్నారు.