ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకు రావాలని లోక్ సభలో వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. అవసరమైతే తాలిబన్లతో సంప్రదింపులు జరిపి ప్రతి ఒక్కరినీ ఇండియకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆఫ్ఘన్ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ నేడు ఢిల్లీ లో నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఆఫ్ఘన్ లో చాల మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందినవారు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారిని వీలైనంత త్వరలో అక్కడినుంచి రప్పించేందుకు చొరవ చూపాలని కోరినట్లు మిథున్ రెడ్డి వెల్లడించారు.
దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తగిన వ్యూహాలు రూపొందించాలని తమ పార్టీ తరఫున కేంద్రానికి తెలియజేశామని, తాము ప్రస్తావించిన అన్ని అంశాలనూ విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ నోట్ చేసుకున్నారని చెప్పారు. ఆఫ్ఘన్ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తామని జై శంకర్ చెప్పారని మిథున్ రెడ్డి చెప్పారు.